హైదరాబాద్, వెలుగు: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళలు మృతికి కారకులైనోళ్లపై చర్యలు తప్పవని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘ఇబ్రహీంపట్నం ఘటనపై దొంగాట’ శీర్షికన ఆదివారం ‘వెలుగు’లో వచ్చిన వార్తపై డీహెచ్ స్పందించారు. బాధ్యులపై చర్యలకు సర్కారు వెనుకాడుతోందనడంలో నిజం లేదన్నారు. హాస్పిటల్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్‌ను టీవీవీపీ కమిషనర్ సస్పెండ్ చేశారని తెలిపారు. ఇదే విషయమై శ్రీధర్‌ను వివరణ కోరగా.. తనకు ఇంతవరకు సస్పెన్షన్ నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. అసలు తాను సూపరింటెండెంట్‌నే కాదని, డీడీవో మాత్రమేనని చెప్పారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రస్తుతం సెలవులో ఉన్నానని, ఎంక్వైరీ తర్వాత అన్ని విషయాలు తేలుతాయని చెప్పారు. అప్పటివరకు అధికారులు చెప్పినట్టు నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సర్జరీలు చేసిన డాక్టర్ జోయల్ లైసెన్స్‌ను మెడికల్ కౌన్సిల్ టెంపరరీగా సస్పెండ్ చేసిందని డీహెచ్ వెలుగుకు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ఎంక్వైరీ కొనసాగుతోందని, ఫైనల్ రిపోర్ట్ వచ్చాక బాధ్యులుగా తేలినోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇయ్యాల ఫైనల్ రిపోర్ట్
ఇబ్రహీంపట్నం డీపీఎల్ మరణాలపై ఈ నెల 5న (సోమవారం) ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని ఇదివరకే డీహెచ్ ప్రకటించారు. దీనిపై ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు ఆదివారం రివ్యూ చేశారు. ఎంక్వైరీలో ప్రాథమికంగా గుర్తించిన అంశాలను కమిటీ.. మంత్రికి వివరించినట్టు తెలిసింది.