- ఇప్పటికే ఈఆర్సీకి ప్రతిపాదనలు అందించిన డిస్కంలు
- ఏఆర్ఆర్పై పబ్లిక్ హియరింగ్
- విచారణ పూర్తయ్యాకఈ నెలాఖరుకు నిర్ణయం ప్రకటించనున్న ఈఆర్ సీ
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఈ నెల 23న బహిరంగ విచారణ చేపట్టనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు సదరన్ డిస్కం, నార్తర్న్ డిస్కంలు 2024–25 నుంచి 2028–29 వరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత (అగ్రిగేట్ రెవెన్యూ రిపోర్ట్(ఏఆర్ఆర్)) కు సంబంధించిన ప్రతిపాదనలను ఈఆర్సీకి పంపించాయి.
2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5818 కోట్లు, 2025–26లో రూ.6,682 కోట్లు, 2026–27లో రూ.8,576 కోట్లు, 2027–28లో రూ.9,914 కోట్లు, 2028–29లో రూ.11,334 కోట్లు అవసరం అవుతాయని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సదరన్ డిస్కం ప్రతిపాదించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న నార్తర్న్ డిస్కం.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.3892 కోట్లు, 2025–26లో రూ.4,349 కోట్లు, 2026–27లో రూ.5,460 కోట్లు, 2027–28లో రూ.6,115 కోట్లు, 2028–29లో రూ.6,806 కోట్లు అవసరం అవుతాయని ప్రతిపాదించింది.
ఇందులో ఓపెన్ యాక్సిస్ చార్జీలు నుంచి వచ్చే ఆదాయం, టారిఫ్ యేతర ఆదాయం పోను నికర సమగ్ర ఆదాయ అవసరాలను ప్రతిపాదించాయి. వీలింగ్ టారిఫ్, పంపిణీ నష్టాలు మూలధనం పెట్టుబడులతో కలిపి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు చేశాయి. దీనికి తగినట్లుగా చార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని ఎల్టీ, హెచ్టీ వినియోగదారుల వారీగా కరెంటు చార్జీల ప్రతిపాదనలు పంపించాయి. దీనిపై పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయాలను సేకరణ చేపట్టింది. అక్టోబర్ 11 నాటికి సేకరించిన అభిప్రాయాలపై ఈ నెల 23న బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ విచారణ పూర్తయితే ఈ నెల 29న లేదా ఈ నెలాఖరున చార్జీలకు ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.