తెలంగాణలోనూ జవాబుదారీ చట్టం అవసరం

  • రాజస్థాన్​ తరహాలో పోర్టల్​ రూపొందించాలి
  • పబ్లిక్​ హియరింగ్​లోజ్యూరీ సభ్యుల సూచన
  • వివిధ సమస్యలను జ్యూరీ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు
  •  ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలోనూ పటిష్టమైన జవాబుదారీ వ్యవస్థ ఉండాలని, త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారానికి రాజస్థాన్, కర్నాటక తరహాలో ప్రత్యేక పోర్టల్​రూపొందించాలని పబ్లిక్​ హియరింగ్​లో జ్యూరీ సభ్యులు సూచించారు.

 సోమవారం హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాచార హక్కులు, ఫిర్యాదులు పరిష్కార విధానాలపై పబ్లిక్ హియరింగ్ జరిగింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఉద్యమ నాయకుడు, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎంకేఎస్ఎస్) వ్యవస్థాపకుడు నిఖిల్ డే, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ వ్యవస్థాపకురాలు రుక్మిణీరావు, శాతవాహన విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్స్ (ఎన్ఏపీఎం) జాతీయ కన్వీనర్ మీరా సంఘమిత్రతో కూడిన ప్రత్యేక పీపుల్స్ జ్యూరీ కి అధ్యక్షత వహించగా.. పలువురు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. 

కొవిడ్​తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు పరిహారం రాకపోవడం, వితంతు పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ క్లెయిములు పెండింగ్,​ ఇండ్ల పంపిణీలో జాప్యం, అటవీ హక్కుల చట్టం అమలు చేయకపోవడం లాంటి సమస్యలతో వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. ప్రభుత్వం దగ్గర  ఫిర్యాదులు పెండింగ్​లో ఉన్న  వందలాది మంది బాధితులు ఈ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను జ్యూరీ సభ్యులకు వివరించారు. నల్గొండకు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ.. తన భర్త కరోనా​సమయంలో మృతి చెందాడని, ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకు అందలేదన్నారు.

 ఇలా పలు సమస్యలపై వివిధ జిల్లాల నుంచి  వచ్చిన వందలాది మంది జ్యూరీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమాచారాన్ని పొందడంలో పడుతున్న ఇబ్బందులు, హక్కులు, ప్రయోజనాల జాప్యంపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదులకు నిర్ణీత కాలపరిమితితో కూడిన  పరిష్కార ప్రక్రియ అమలు చేయాలని, పబ్లిక్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజావాణి నోడల్ అధికారి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి.రవికిరణ్ మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రభుత్వ ప్రతిస్పందన ప్రజాస్వామ్యానికి మూలాధారం: జ్యూరీ సభ్యులు 

అనంతరం జ్యూరీ సభ్యులు మాట్లాడుతూ.. జవాబుదారీతనం, ప్రభుత్వ ప్రతిస్పందన ప్రజాస్వామ్యానికి మూలాధారమని పేర్కొన్నారు. జవాబుదారీతనాన్ని నిర్ధారిం చడానికి చట్టపరమైన ఫ్రేమ్​వర్క్​ ప్రవేశపెట్టాలని జ్యూరీ సభ్యులు తీర్మానం చేశారు. రాష్ట్రంలో సమాచార హక్కులు, ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేయడం లో డిజిటల్ టెక్నాలజీ అవసరమని, ఇది పౌరులకు, ప్రభుత్వానికి  ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం జరగడం లేదని, వారి ఫిర్యాదులపై గోప్యత పాటిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు.