- వినతి పత్రాలను పరిశీలిస్తున్న ఎస్సీ వన్ మెన్ కమిషన్ చైర్మన్
- రిపోర్ట్ ఇచ్చే గడువును నెల పాటు పెంచాలని ప్రభుత్వానికి లేఖ
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై వేసిన వన్ మెన్ జ్యుడిషియల్ కమిషన్ జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ పూర్తి చేసింది. ఫైనల్ రిపోర్టును రెడీ చేసేందుకు పబ్లిక్ హియరింగ్ లో వచ్చిన వినతిపత్రాలను కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ పరిశీలిస్తున్నారు. ఈ నెల10 వ తేదీ వరకు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు గడువు ఉండగా.. దాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది.
కాగా..అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఉప కులాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ,జడ్పీ చైర్మన్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వివరాలు అందించాలని లేఖలో కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. ఇప్పటికే 5 జిల్లాల నుంచి కలెక్టర్లు వివరాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై మున్సిపల్, పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు కమిషన్ చైర్మన్ ను కలుస్తూ పలు సందేహాలు తీరుస్తున్నట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు లేదా వచ్చే నెల 10 వరకు రిపోర్ట్ ఇచ్చేందుకు కమిషన్ వేగంగా కసరత్తు చేస్తోంది.
కీలకంగా జనాభా లెక్కలు
రాష్ర్టంలో ఎస్సీ, ఉపకులాల జనాభాకు సంబంధించి 2011 లెక్కలే అమలవుతున్నాయి. 2014 లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, ఇటీవల ప్రభుత్వం చేసిన కులగణన లెక్కలు ఇవ్వాలని ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ను కమిషన్ కోరింది. 2011 తో పాటు సమగ్ర సర్వే లెక్కలు కమిషన్ కు చేరగా, పండుగ వరకు కులగణన లెక్కలు అందిస్తామని డిపార్ట్ మెంట్ తెలిపినట్లు తెలుస్తోంది.
2 నెలల నుంచి కసరత్తు
2024 నవంబర్11న వన్ మెన్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్ బాధ్యతలు చేపట్టగా.. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అప్పటి నుంచి కమిషన్ ను నిత్యం ఎస్సీ సంఘాలు, నేతలు, ప్రజాప్రతినిధులు కలుస్తూ వర్గీకరణపై తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇస్తున్నారు.