విజ్ఞప్తులు స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్​ చేస్తాం : షమీమ్ అక్తర్

విజ్ఞప్తులు స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్​ చేస్తాం : షమీమ్ అక్తర్
  •     ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ 

కరీంనగర్, వెలుగు : ఎస్సీ కులాల ఉప వర్గీకరణ కోసం నిర్వహించిన బహిరంగ విచారణలో తమ దృష్టికి వచ్చిన అభ్యర్థనలు, విజ్ఞప్తులను స్టడీ చేసి పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ వెల్లడించారు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ వర్గీకరణపై అధ్యయనంలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ లో బుధవారం ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కులాల ప్రతినిధుల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు.

 ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీల్లోని వివిధ కులాల నుంచి 128 వినతులు, అభ్యర్థనలు అందాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, ఉద్యోగ, సామాజిక పరిస్థితులు, చరిత్రాత్మక వ్యవహారాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు. అంతకుముందు చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్ షమీమ్ అక్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ పమేలా సత్పతి మర్యాదపూర్వకంగా కలిశారు. 

అనంతరం సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. విచారణ అనంతరం కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీని ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వసతుల కల్పన, మౌలిక సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

వర్గీకరణ చేయొద్దని కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతి  

సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, ఎస్సీల్లో వర్గీకరణ చేయొద్దని కోరుతూ మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్  జస్టిస్ షమీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ జనాభా 15 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగిందని, ఆ ప్రకారం తమకు రిజర్వేషన్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట సీనియర్ నాయకులు అర్ష మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర కార్యదర్శి మధు,  జాతీయ మహిళా కార్యదర్శి జూపాక పద్మ తదితరులు పాల్గొన్నారు.