ఆదిలాబాద్ కలెక్టరేట్​లో ప్రజావాణికి వినతుల వెల్లువ

ఆదిలాబాద్ కలెక్టరేట్​లో ప్రజావాణికి వినతుల వెల్లువ

ఆదిలాబాద్​టౌన్/నస్పూర్, వెలుగు: ఆదిలా బాద్ కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు విన్నవిస్తూ కలెక్టర్​రాజర్షి షాకు దరఖాస్తులు అందజేశారు. డీఆర్​డీవో, డీపీవో, డీడబ్ల్యూవో, వ్యవసాయం, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించి మొత్తం 78 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.  ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్​డీవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నా కొడుకు అక్రమంగా పట్టా చేసుకున్న భూమిని ఇప్పించండి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్ లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. తన పేరిట ఉన్న భూమిని తన కొడుకు ఫోర్జరీ సంతకాలు చేసి అతడి పేరిట మార్పు చేసుకున్నాడని, ఈ మార్పును రద్దు చేసి భూమిని తన పేరిట మార్చాలని కోరుతూ బెల్లంపల్లి మండలం పెద్దనపల్లి గ్రామానికి చెందిన కాదాసి రాయపోసు దరఖాస్తు సమర్పించింది. 

ప్రమాద బీమా ఇప్పించాలని, భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని, ఉపాధి కల్పించాలని తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేయాలని కలెక్టర్​ ఆదేశించారు.