బంగారమే ఆసరైతుంది
పెరిగిన ధరలు కలిసొచ్చినయ్
పరిస్థితి మెరుగుపడితే మళ్లీ కొనొచ్చనే ఆలోచన
అమ్మేవారిలో తక్కువ గోల్డ్ ఉన్నవారే ఎక్కువ
“ మహేందర్ ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్. శాలరీ 30 వేలు. కరోనా ఎఫెక్ట్ తో జీతంలో కోత పడింది. అలవెన్సులు బంద్ అయ్యాయి. దాంతో ఈఎంఐలు కట్టడం భారమవడంతో ఇంట్లో ఉన్న 8 తులాల గోల్డ్ తాకట్టు పెట్టి ఖర్చులకు వాడుతున్నాడు.’’
“ కరోనాతో జాబ్ కోల్పోయిన రఘునాథ్ కు ఇంటి ఖర్చులకు కూడా వెళ్లని పరిస్థితి. జాబ్ సెర్చింగ్లో ఉంటూనే కుటుంబాన్ని నెట్టు కొచ్చేందుకు ఉన్న 3 తులాల గోల్డ్ ను పాన్ బ్రోకరేజీ కంపెనీలో అమ్మేశాడు.’’
హైదరాబాద్, వెలుగు: కరోనాతో దెబ్బతిన్న ఫైనాన్షియల్ ప్లానింగ్ నుంచి నిలదొక్కుకునేందుకు ఇంట్లోని బంగారమే ఆసరా అవుతోంది. ధర పెరగడంతో మిడిల్ క్లాస్ పీపుల్ అమ్ముకునేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. తగ్గిన ఇన్ కం, పెరిగిన ఖర్చులు, అవసరానికి అప్పులు దొరకని పరిస్థితి ఉన్న వారంతా బంగారాన్ని తాకట్టుపెట్టడమో, అమ్ముకోవడమో చేస్తున్నారు. అప్పులు, ఈఎంఐల భారం తగ్గించుకునేందుకు ఇదొక మార్గంగా భావిస్తున్నారు. కొత్తగా అప్పులు చేయడంకంటే ధర బాగా పెరిగినందున ఉన్న బంగారాన్ని నగదుగా మార్చుకుని ఆర్థికంగా నిలబడడం బెస్ట్ అనుకుంటున్నారు.
అమ్మకానికే ఎక్కువ మంది ఇంట్రస్ట్
లాక్డౌన్కు ముందు 10 గ్రాముల బంగారం రూ. 44 వేలుంటే, ఇప్పుడు రూ. 57వేలు దాటింది. దాంతో ఇంటి, హాస్పిటల్ ఖర్చుల కోసం అనేకమంది అమ్మేస్తున్నారు. సిటీలో 100కి పైగా కార్పొరేట్ పాన్ బ్రోకరేజీ సంస్థలు ఉండగా, 500 మందికి పైగా ప్రైవేట్ వ్యక్తులు పాన్ బ్రోకరేజీ బిజినెస్ చేస్తున్నారు. నార్మల్ డేస్లో ప్రతి నెల 30 నుంచి 40 కిలోల బంగారం తాకట్టుతో పాటు క్రయ, విక్రయాలు జరుపుతుంటారు. గత రెండు నెలల్లో 120 కిలోలకు చేరినట్లు తెలిసింది. తాకట్టుకన్నా, అమ్మకానికే ఎక్కుమంది ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఆటికా, ముత్తూట్, మణప్పురం వంటి కార్పొరేట్ పాన్ బ్రోకరేజీ సంస్థల కంటే నేరుగా వ్యాపారులు, ఫైనాన్సర్ల వద్ద బంగారాన్ని అమేస్తున్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని డిస్పర్స్ చేసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోందని వ్యాపారులు చెప్తున్నారు. లాక్ డౌన్ రోజుల్లో డైలీ ఒకరిద్దరు మాత్రమే అమ్మేందుకు రాగా, ఇప్పుడు 20 మందికి పైగా వస్తున్నట్లు తెలిపారు. రెండు, మూడు తులాల నగలు ఎక్కువగా వస్తున్నాయని హిమయత్ నగర్ లోని ఓ కంపెనీ స్టోర్ మేనేజర్ భరత్ కుమార్ తెలిపాడు.
పర్సంటేజీల్లో తేడాలు
గోల్డ్ తాకట్టు పెట్టాలన్నా, అమ్ముకోవాలన్నా ఆయా సంస్థలు నిర్థిష్ట రూపంలో కోత పెడతాయి. అది మొత్తం బంగారంపై వచ్చే నగదుపై 25శాతం దాకా ఉంటుంది. వ్యాపారుల దగ్గర బంగారం అమ్ముకుంటే తులం ధరపై 5 నుంచి 10శాతం, లేదా మార్కెట్ రేటుకు రూ. వెయ్యి తక్కువ చేసి డబ్బు చెల్లిస్తున్నారు. దాంతో ఫైనాన్స్ సంస్థల కంటే వ్యాపారులను వద్దకే ఎక్కువమంది వెళ్తున్నారు.
ఈఎంఐలు క్లియర్ చేసేందుకు..
లాక్డౌన్ కారణంగా గోల్డ్ లోన్స్ తీసుకునేవారి సంఖ్య బాగా పడిపోయింది. కరోనాతో ఈఎంఐలు, లోన్ల భారం భరించలేక ఉన్న బంగారాన్ని నగదుగా మార్చి లోన్లు, ఈఎంఐలు క్లియర్ చేసుకుంటున్నారు. గోల్డ్ రేటు పెరగడంతో ఇతర ఇన్ కం సోర్సులేని వాళ్లు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. – శ్రీపాల్, ముత్తూట్ ఫైనాన్స్ , విద్యానగర్ బ్రాంచ్ మేనేజర్
ధర పెరగడంతో ఎక్కువమంది ఇంట్రస్ట్
కరోనాతో మిడిల్ క్లాస్ పబ్లికే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఇన్ కం సోర్సెస్ దెబ్బతినడంతో ఉన్న బంగారాన్ని అమ్ముకుని డబ్బుగా మార్చుకుంటున్నారు. గత 45 రోజుల్లో 70మంది దగ్గర బంగారం కొని డబ్బు ఇచ్చాం. ధర పెరగడంతో అవసరాలు తీర్చుకునే క్రమంలో తాకట్టుగా కంటే అమ్మకానికి ఎక్కువమంది ఇంట్రస్ట్ చూపుతున్నారు.
‑ రవి యాదవ్, ఫైనాన్స్ నిర్వాహకుడు
For More News..