మార్చి 8న సికింద్రాబాద్లో లక్ష మంది మహిళలతో సభ

మార్చి 8న సికింద్రాబాద్లో లక్ష మంది మహిళలతో సభ

 

  • మహిళా దినోత్సవం నాడు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు 
  • అదేరోజు పలు కొత్త పథకాలకు శ్రీకారం 
  • జిల్లాకో పెట్రోల్ బంక్, సోలార్ ప్లాంట్ నిర్మాణం 
  • ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే 50 బస్సులు ప్రారంభం  
  • 14 వేల అంగన్‌వాడీ పోస్టులకూ నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8న మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో భారీ సభ నిర్వహించనున్నది. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి జిల్లాల నుంచి మహిళలను తరలించేలా ప్రణాళిక రూపొందించింది. అదే రోజున సభా వేదికగా మహిళల కోసం మరిన్ని పథకాలు ప్రారంభించనున్నది. ప్రభుత్వం ఏడాదిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించడంతో పాటు భవిష్యత్తులో మహిళా సాధికారతకు తీసుకునే చర్యలపై కార్యాచరణ ప్రకటించనున్నది. 

(మొదటి పేజీ తరువాయి)
ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. మహిళల కోసం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మ‌‌హిళా సంఘాల‌‌ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 32 జిల్లాలో వీటిని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ సైతం చేపట్టింది.  జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణాలు లాంఛ‌‌నంగా ప్రారంభించనున్నది. పరేడ్ గ్రౌండ్ సభలోనే సీఎం రేవంత్​రెడ్డి వ‌‌ర్చువ‌‌ల్‌‌గా సోలార్​ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాప‌‌న చేయనున్నారు. అంతేకాకుండా మ‌‌హిళా సంఘాలతో బ‌‌స్సులు కొనుగోలు చేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందం కుదిరింది. మొద‌‌టి విడ‌‌త‌‌లో 50 బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. అదేరోజు సీఎం చేతుల మీదుగా ఈ బస్సులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇందిరా మహిళా శక్తి పాలసీ..  

మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాకో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే నారాయణపేట జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభమైంది. మిగిలిన జిల్లాల్లోనూ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు బీపీఎల్, హెచ్‌‌పీసీఎల్, ఐఓసీఎల్ వంటి ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదర్చుకుంది. అలాగే సభలో మహిళా సంఘాలకు వ‌‌డ్డీ లేని రుణాల చెక్కుల‌‌ను అంద‌‌జేయ‌‌నున్నారు. ఈ ఏడాది కాలంలో ప్రమాద‌‌వ‌‌శాత్తు మ‌‌ర‌‌ణించిన 400 మంది మ‌‌హిళల కుటుంసభ్యులకు రూ.40 కోట్ల ప్రమాద బీమా చెక్కుల‌‌ను పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా 14 వేలకు పైగా అంగ‌‌న్‌‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామ‌‌కాలకు నోటిఫికేషన్​జారీ చేయనున్నారు. ఇందిరా మ‌‌హిళా శ‌‌క్తి–2025 పాలసీని ప్రకటించనున్నారు. కాగా, మ‌‌హిళ‌‌ల‌‌కు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. ఈ  నేప‌‌థ్యంలో మ‌‌హిళ‌‌ల‌‌కు స‌‌బ్సిడీపై ఆటోలు అందించే అంశంపై  ప్రభుత్వం ప‌‌రిశీలన చేస్తున్నది. ప‌‌ట్టణాల్లో మ‌‌హిళా సంఘాలను బ‌‌లోపేతం చేసేలా ప్రభుత్వం కీల‌‌క ప్రక‌‌ట‌‌న చేసే అవ‌‌కాశం ఉంది. సెర్ప్, మెప్మాల‌‌ను ఒకే గొడుగు కింద‌‌కు తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నది.  వీటితో పాటు మ‌‌హిళ‌‌ల భ‌‌ద్రత‌‌, ఆరోగ్యం, ఆర్థిక పరిపుష్టి కోసం మ‌‌రికొన్ని ప‌‌థ‌‌కాల‌‌కు రూపకల్పన చేసే అవ‌‌కాశం ఉంది. 

సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: సీతక్క 

మ‌‌హిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాల‌‌ని, అందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారుల‌‌ను మంత్రి సీత‌‌క్క ఆదేశించారు. ప‌‌రేడ్ గ్రౌండ్‌‌లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం సెక్రటేరియెట్‌‌లో అధికారుల‌‌తో స‌‌మీక్ష నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ, మహిళా సాధికారత కోసం కొత్తగా ప్రారంభించే పథకాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసి, అత్యుత్తమ పాలసీని రూపొందించాల‌‌ని అధికారుల‌‌ను ఆదేశించారు. స‌‌భ‌‌కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇత‌‌ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. సభా వేదిక పైనుంచి ప‌‌లు కొత్త ప‌‌థ‌‌కాల‌‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. సమావేశంలో మహిళా కమిషన్ చైర్‌‌‌‌ప‌‌ర్సన్ నేరెళ్ల శారద, మహిళా కార్పొరేషన్ చైర్‌‌‌‌పర్సన్ బండ్రు శోభారాణి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌పర్సన్ వెన్నెలా గ‌‌ద్దర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌‌పర్సన్‌‌ అలేఖ్య పుంజాల తదితరులు పాల్గొన్నారు.