
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు భూమి ధ్రువీకరణ కోసం మార్చి 6న ఉదయం 11 గంటలకు బొగ్గు గని ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు మందమర్రి ఏరియా జీఎం కె.దేవేందర్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
శాంతిఖనికి ఎంతో చరిత్ర ఉందని, 1954లో ప్రారంభించిన ఈ గనిలో దాదాపు 18 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, వాటిని లాంగ్ వాల్ ప్రాజెక్టు ద్వారా వెలికితీస్తామన్నారు. ఆకెనపల్లి గ్రామ సమీపంలో 681.23 హెక్టార్ల భూమిలో 1.167 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ అనుమతులు, గని లాంగ్ వాల్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయడానికి, దాదాపు 800 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర అధికారులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో మందమర్రి ఏరియా ఎస్ వోటుజీఎం విజయ ప్రసాద్, పర్యావరణ అధికారి వెంకట్ రెడ్డి, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, శాంతిఖని ప్రాజెక్టు అధికారి ఖదీర్, మందమరి ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి తదితరులు పాల్గొన్నారు.