
నిర్మల్, వెలుగు: చత్తీస్‌గడ్ అడవుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లను ఆపి మావోయిస్టులతో చర్చలు జరిపి, శాంతి నెలకొల్పాలని ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. శుక్రవారం నిర్మల్‌లోని టీఎన్జీవో భవన్ లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఎన్‌కౌంటర్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం స్పందించకపోవడం సమంజసం కాదన్నారు. ఆదివాసీలు భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడుతుంటే వారిపై మావోయిస్టు ముద్ర వేసి ఎన్‌కౌంట్లరు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల లీడర్లు ఎస్ఎన్ రెడ్డి, దుర్గం నూతన్ కుమార్, జె.రాజు, కె.రాజన్న, రామ్ లక్ష్మణ్, గోవర్ధన్, జ్యోతి, గులాం దుర్వాణి, పోశెట్టి, రఘోత్తంరెడ్డి, అజయ్, మహబూబ్, సంజీవ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.