పోడు పట్టాల పంపిణీలో పలు చోట్ల అధికార బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నిరసన సెగ తగులుతోంది. చాలా మంది లబ్ధిదారులు తమకు పోడు పట్టాలు అందలేదని ఆరోపిస్తూ నేతలను అడ్డుకుంటున్నారు. అలాంటి అనుభవమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేకి జరిగింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జులై 6న పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లక్ష్మీదేవి పల్లిలో చేపట్టాడు.
ఈ క్రమంలో తమ గ్రామాలకు పట్టాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. రేగళ్ల, భావోజి తండా, పెద్ద తండాలకు చెందిన రైతులు పట్టాల పంపిణీ కార్యక్రమం దగ్గరికి వచ్చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేగళ్లకు చెందిన ఓ భూస్వామి చేతుల్లో వందల ఎకరాల పోడు భూములు ఉన్నాయని.. అతనిపై చర్యలు తీసుకొని తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు చూసిన రైతులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.