హైదరాబాద్: శ్రీనగర్ కాలనీలోని ఎల్లారెడ్డిగూడలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడటంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ప్రభుత్వ స్కూల్పై కరెంటు లైన్ తెగిపడిన ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తూ.. విద్యార్థులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. జనావాసాల మధ్య నుంచి 34 కేవీ హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. అమీర్పేట్ సబ్ స్టేషన్ ముందు కూడా స్థానికుల నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానికులతో కలిసి సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ వనం సంగీత ఆందోళనకు దిగడంతో భారీగా పోలీసుల మోహరించారు. హైదరాబాద్ నగరంలో హైటెన్షన్ వైర్లు నగరవాసుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. నేరేడ్మెట్లో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. జనావాసాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.