బీఆర్ఎస్​ పార్టీ లీడర్లకే దళిత బంధు ఇస్తున్నరంటూ ఆందోళన

బీఆర్ఎస్​ పార్టీ లీడర్లకే దళిత బంధు ఇస్తున్నరంటూ ఆందోళన
  • సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లిలో సర్పంచ్, ఎంపీపీ దిష్టిబొమ్మల దహనం
  • సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కేసీఆర్​ దిష్టిబొమ్మతో శవయాత్ర  

కొండపాక , వెలుగు :  దళిత బంధు పథకాన్ని  గ్రామంలోని అన్ని  దళిత  కుటుంబాలకు ఇవ్వాల్సి ఉండగా, సర్పంచ్, ఎంపీపీలు తమకు కావాల్సిన వారికే ఇస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా కొండపాక మండల అంకిరెడ్డి పల్లిలో ఆదివారం దళితులు నిరసన ర్యాలీ తీసి దిష్టిబొమ్మలు దహనం చేశారు.  సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్  నియోజక పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో 165 కుటుంబాలుండగా  9 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించడంతో సర్పంచ్ భర్త నర్సింహులును  నిలదీశారు. తర్వాత ర్యాలీ నిర్వహించి సర్పంచ్, ఎంపీపీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిరసనకారులకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగరావు సంఘీభావం తెలిపారు. జలిగామ వేణు, భానుప్రసాద్​, రుక్కి ప్రదీప్, రాజు, జక్కుల నర్సింహులు, అంజయ్య, సుదర్శన్ పాల్గొన్నారు. 

అధికార పార్టీ వాళ్లకి ఇస్తారా...?

జిన్నారం : దళితబంధు అధికార పార్టీ చెందిన వారికి మాత్రమే ఇస్తున్నారని, అర్హులకు ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో దళితులతో కలిసి నిరసన తెలిపారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్​దిష్టిబొమ్మతో అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. 

అంబేద్కర్ చౌరస్తా వద్ద శ్రీనివాస్​గౌడ్​మాట్లాడుతూ జిన్నారం మండలంలోని 955 కుటుంబాల్లో బీఆర్ఎస్ లీడర్లు, అనుచరులకు చెందిన152 కుటుంబాలకు మాత్రమే దళిత బంధు ఇవ్వడం బాధాకరమన్నాడు. అర్హులైన దళిత కుటుంబాలందరికీ  దళితబంధు ఇచ్చేంతవరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి, టీపీసీసీ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగు రమేశ్, ఎంపీపీలు గోవర్ధన్ గౌడ్, ప్రతాపరెడ్డి, నాయకులు వీరారెడ్డి, రాజు , పట్నం శ్రీనివాస్, మహేశ్, జయశంకర్, రవి,నరేశ్, మహేందర్ రెడ్డి, ఆనంద్​ ఉన్నారు.