కార్మికులు, ఉద్యోగులు అంతా రోడ్లమీదే..

  • ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ఆందోళనలు
  • పంచాయతీ కార్మికులు, రెండో ఏఎన్ఎంలు, స్వీపర్లు, మిషన్ భగీరథ కార్మికుల నిరసనలు
  • ఈజీఎస్​, కాంట్రాక్ట్ ఉద్యోగులదీ ఇదే దారి 

నల్గొండ, వెలుగు : ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారు తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఆందోళనల బాట పడుతున్నారు. నిన్నా, మొన్నటి వరకు ఆచితూచి నిరసనలు తెలిపిన వారు ఇప్పుడు ఉధృతం చేశారు. 

కలెక్టరేట్ల వద్ద మాత్రమే ధర్నాలు చేసిన వారు ఇప్పుడు మండల, డివిజన్​స్థాయిల్లోనే కాకుండా తమ నిరసన ప్రభుత్వం దృష్టికి చేరడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు.   రోజూ పనిచేస్తున్న శాఖల గేట్ల ముందు కూడా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇలాగైనా తమ సమస్యలను సర్కారు గుర్తించి పరిష్కరిస్తుందని ఆశిస్తున్నారు.  

ఎలక్షన్ల ముందు నిరసనలే మార్గమని.. 

ఎలక్షన్లు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఆందోళనలు ఉగ్రరూపం దాలిస్తేనే సీఎం కేసీఆర్​పట్టించుకుంటాడన్న ఆలోచనలో వివిధ డిపార్ట్​మెంట్లలోని కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా సీఎం కేసీఆర్​అనుసరించిన తీరుతో కార్మికులు, ఉద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఓట్లపై ప్రభావం చూపుతుందని భావించిన కేసీఆర్​ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. 

దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, సెర్ప్​ఉద్యోగులకు పేస్కేల్​ వర్తింపు, మధ్యాహ్న భోజన రేట్లు పెంపు డిమాండ్ల పై సర్కారు దిగి రావడానికి ఎన్నికలే కారణమంటున్నారు. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో చాలీచాలని జీతాలతో ఏండ్ల తరబడి నెట్టుకొస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కనీస వేతనం అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం పక్కన పెట్టడం, తెలంగాణ వచ్చాక కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని తీసుకొచ్చిన 60, 4, 306 జీవోలను కూడా అమలు చేయకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. తాము ఆందోళనలు తెలిపితే వచ్చే ఎన్నికల కోసమైనా కేసీఆర్​అమలు చేస్తాడని ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. 

ఆందోళనలో 2 లక్షలకు పైగా కార్మికులు

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షలకు పైగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. వీళ్లలో 50 ఏండ్లు దాటి, రిటైర్మెంట్​కు దగ్గరున్న వారు కూడా ఉన్నారు. 42 రోజుల నుంచి సర్కార్​స్కూళ్లలో పనిచేస్తున్న స్వీపర్లు జడ్పీ ఆఫీసుల ఎదుట రిలే దీక్షలు చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రూ.13వేలు ఇవ్వాలని, కనీసం వేతనం రూ.26వేలు ఇవ్వాలని, అన్ని స్కూళ్లలో స్వీపర్ల పోస్టులు నింపాలని వీరు డిమాండ్​ చేస్తున్నారు. దీంట్లో భాగంగా సోమవారం జడ్పీ ఆఫీసులను ముట్టడించే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్​ వర్తింప చేసినట్టుగానే తమకూ చేయాలని ఉపాధి ఉద్యోగులు కోరుతున్నారు. 

కానీ ప్రభుత్వం పే స్కేల్​ ఇచ్చేదిలేదని, జీతాలు మాత్రమే పెంచుతామని చెప్తోంది. దీనికి ఒప్పుకోని ఉద్యోగులు మంత్రులు హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్​రావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. గ్రామ కార్యదర్శులను రెగ్యులర్​ చేస్తామని చెప్పిన సర్కార్​ఇంకా ఆ ప్రక్రియ చేపట్టలేదు. మిషన్​భగీరథ స్కీంలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో అన్ని ఆర్​డబ్ల్యూఎస్​ఎస్​ఈ ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండిపెడ్తున్న వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని ఇటీవల టోకెన్​ సమ్మె చేశారు. హెల్త్ డిపార్ట్​మెంట్​లో రెండో ఏఎన్ఎమ్​ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్​ చేయాలని జిల్లాలోని డీఎంహెచ్​ఓ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. 16 ఏండ్లుగా రెండో ఏఎన్ ఎమ్​ కేటగిరీ పేరుతో డిపార్ట్​మెంట్​లో రూ.23వేల ఫిక్సుడ్​శాలరీలతో తమ జీవితాలను ఫిక్స్​చేశారని, ఇప్పటికైనా పర్మినెంట్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. 

పెరిగిన పనిభారం..

అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్ల పైన పనిభారం పెరిగింది. ఐసీడీఎస్​, హెల్త్​ డిపార్ట్​మెంట్ల పనులు అంగన్​వాడీ టీచర్లు, ఆయాలతోనే చేయిస్తున్నారు. రకరకాల సర్వేలు, ఎన్​ఆర్​హెచ్ఎం రిపోర్టులు తయారు చేయడం వంటి పనులతో భారం పెరిగి వ్యక్తిగత జీవితాలకు దూరమవుతున్నారు. ఇది చాలదన్నట్టుగా నల్గొండ జిల్లాలో టీచర్లను పీహెచ్ సీలకు వచ్చే గర్భిణులకు అన్నం వండి పెట్టాలని కలెక్టర్​ఆర్​వి. కర్ణన్​ఆదేశాలిచ్చారు. 

వీటన్నింటికి నిరసనగా సోమవారం అంగన్ వాడీలు కలెక్టరేట్​ఎదుట ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలని, పనిభారం తగ్గించాలనే డిమాండ్లతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాలని శనివారం హైదరాబాద్​లో జరిగిన మీటింగ్​లో తీర్మానించారు. 

ఎన్నికల ముందైనా ప్రభుత్వం దిగిస్తొందని 

ఎన్నికల ముందు కాబట్టి ప్రభుత్వం తప్పక దిగొస్తుందనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ వచ్చాక అయిన జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించారు. కానీ, ఆందోళనలు, ధ ర్నాలు చేస్తున్న వారిని ప్రభుత్వం అణిచివేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులేగాక, కార్మిక శాఖ తీసుకొచ్చిన కనీస వేతన చట్టాలు కూడా అమలు చేయకపోవడం బాధాకరం. 
- తుమ్మల వీరారెడ్డి