
- డ్రైనేజీల రిపేర్లయినా చేయిస్తలేరని ఎమ్మెల్యే దివాకర్ రావును నిలదీత
- పంట రుణాలను ఎందుకు మాఫీ చేస్తలేరని ఎర్రబెల్లిని ప్రశ్నించిన రైతు
- పింఛన్ ఇప్పించాలని ఎమ్మెల్యే రసమయి కాళ్లపై పడ్డ వృద్ధురాలు
- పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధులకు తప్పని నిరసన సెగలు
పల్లె ప్రగతిలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి నిరసన సెగ తప్పడం లేదు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి గొప్పగా చెప్పుకుంటున్న రూలింగ్ పార్టీ లీడర్లను సమస్యలపై పబ్లిక్ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పంట రుణాలను ఎందుకు మాఫీ చేస్తలేరని ఓ రైతు మంత్రి ఎర్రబెల్లిని నిలదీయగా, గెలిచినంక దండలేసి హారతి పడ్తే కనీసం డ్రైనేజీలను కూడా రిపేర్ చేయిస్తలేరని మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావుపై మహిళలు మండిపడ్డారు. ఓ వృద్ధురాలు తనకు వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని ఎమ్మెల్యే రసమయి కాళ్లపై పడి వేడుకున్నది.
మంచిర్యాల, వెలుగు: ‘మీరు గెలిచి వచ్చిప్పుడు దండలేసినం.. ఆనందంగా హారతులిచ్చినం.. కానీ మాకేం చేసిన్రు.. మా వాడల మోరీలుసక్కగలేవ్.. మూడ్రోజులకోసారి మురికి నీళ్లు వస్తున్నయ్.. గిదేనా మీ పని’ అంటూ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును పట్టణంలోని 15వ వార్డు మహిళలు నిలదీశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, టీఆర్ఎస్ లీడర్లతో కలిసి ఎమ్మెల్యే వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఎన్నడో కట్టిన రోడ్లు, డ్రైనేజీలు పాడయ్యాయని, రిపేర్లు కూడా చేయడం లేదని అన్నారు. మున్సిపల్ఎలక్షన్లకు వచ్చినప్పుడు చెప్తే ఎలక్షన్లు అయ్యాక చేపిస్తా అన్నారని, ఆ తర్వాత పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. వానొస్తే రోడ్డు మునిగిపోతోందని, నీళ్లు నిలిచి బైక్‌లు స్కిడ్ అయి కిందపడుతున్నారని చెప్పారు. మూడ్రోజులకోసారి మురికి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ రోడ్లు, డ్రైనేజీలు తామే కట్టామని అన్నారు. ఎన్నడో కట్టినవి పాడయ్యాయని, మీ ఇల్లు పాడైతే రిపేర్ చేయించరా.. మరి మాకెందుకు చేయించరని అడిగారు. కౌన్సిలర్‌కు ఫండ్స్శాంక్షన్ చేశామని ఎమ్మెల్యే బదులివ్వగా.. ఫండ్స్ విషయం మీరు చూసుకోండి.. మాకు మాత్రం వర్క్ చేయండని డిమాండ్ చేశారు. అసహనం చెందిన ఎమ్మెల్యే రోడ్డు బాగానే ఉంది.. ఇంతకంటే ఎక్కువ చేయలేమని అన్నారు. దాంతో ‘ఎమ్మెల్యేగా నేను ఏమీ చేయలేనని’ రాసియ్యాలని పట్టుబట్టారు. ఇంతలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య కల్పించుకుని మీకు మాటలు కావాలా.. పనులు కావాలా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రూలింగ్పార్టీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్కాంగ్రెస్కౌన్సిలర్లను చిన్నచూపు చూస్తున్నారని 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత అన్నారు. ఎలక్షన్లు జరిగి ఏడాదిన్నర గడిచినా 15వ వార్డులో రూ.5 లక్షల వర్క్ మాత్రమే చేశారని, అదీ టీఆర్ఎస్ లీడర్లకు ఇచ్చారని చెప్పారు. ఏడాది కిందట రూ.42 లక్షల వర్క్శాంక్షన్చేసినా ఇంతవరకు స్టార్ట్ చేయలేదన్నారు.