ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఆఫీసర్లు డుమ్మా
హనుమకొండ, వెలుగు: ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్ ను ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు లైట్తీసుకున్నరు. సోమవారం హనుమకొండలోని కాన్ఫరెన్స్ హాలులో జడ్పీ చైర్మన్ డా.సుధీర్ కుమార్ అధ్యక్షతన హనుమకొండ జడ్పీ జనరల్‌బాడీ నిర్వహించారు. జిల్లా పరిధిలోని లీడర్లు, వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు లైట్తీసుకోవడంతో సరైన చర్చ జరగకుండానే మొక్కుబడిగా మీటింగ్ ముగిసింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు హాజరయ్యారు. వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఆయా శాఖల ప్రగతి నివేదికలను సభ్యులకు చదివి వినిపించారు. ధర్మసాగర్, వేలేరు జడ్పీటీసీలు పిట్టల శ్రీలత, చాడ సరిత పీహెచ్‌సీల్లో సరిపడా డాక్టర్లు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇన్ఛార్జ్, డిప్యూటేషన్ డాక్టర్లు, సిబ్బందితో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.
డీఎంహెచ్‌వో సాంబశివరావు స్పందిస్తూ.. తొందరలోనే డాక్టర్ల నియామకం పూర్తవుతుందని చెప్పారు. ధర్మసాగర్ మండలంలో వివిధ రోడ్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఐనవోలు మండలంలో కరెంట్సప్లైలో సమస్యలు ఉన్నాయని, వాటని పరిష్కరించాలని జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు కరెంట్ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఖబరస్తాన్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ వలీ కోరారు. ఇంకొందరు సభ్యులు గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రంగుమారి వస్తున్నాయని చెప్పగా.. సమస్యను పరిష్కరిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్లు సమాధానమిచ్చారు. అనంతరం జిల్లాలో ఎయిడ్స్ నివారణకు కృషి చేసి వివిధ అవార్డులు సొంతం చేసుకున్న డా.ఆచంట వివేకానంద ను కలెక్టర్, జడ్పీ చైర్మన్ సహా సభ్యులు సన్మానించారు.
లీడర్లంతా డుమ్మా
జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కో ఆప్షన్ మెంబర్స్ అరకొరగా హాజరుకాగా.. గత మూడు, నాలుగు మీటింగుల నుంచి ఏ ఒక్క లీడర్ కూడా హాజరుకాకపోవడం గమనార్హం. మీటింగ్ హాలులోని కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి మార్గం చూపాల్సిన సమావేశాలు మొక్కుబడిగా సాగుతుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.