- అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు
- స్కూళ్లలో అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ
- నిర్మాణాల్లో తీవ్ర జాప్యంపై మండిపాటు
- వాడీవేడిగా సాగిన జిల్లా పరిషత్చివరి సర్వసభ్య సమావేశం
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: తమ పదవీ కాలం గడిచిపోనుంది కానీ గత సమావేశాల్లో తాము లేవనెత్తిన సమస్యలేవీ పరిష్కారం కాలేదని సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో శుక్రవారం జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కలెక్టర్రాజర్షి షా, డీఎఫ్ఓ ప్రాశాంత్బాజీరావు పాటిల్, జడ్పీ సీఈఓ రత్నమాల, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి పాల్గొన్నారు. ప్రారంభం నుంచి చివరి వరకు సమావేశం వాడివేడీగా సాగింది.
అస్తవ్యస్తంగా స్కూళ్లలో పనులు
విద్యాశాఖ ప్రగతిపై ప్రజాప్రతినిధులు సమీక్షించారు. మన ఊరు-మనబడి కింద చేపట్టిన పాఠశాలల నిర్మాణాల్లో జాప్యం కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయని.. అవి పూర్తి కాకుండానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చారని పలువురు సభ్యులు సభదృష్టికి తీసుకువచ్చారు. మన ఊరు మన బడి కింద జిల్లాలో ఎన్ని పాఠశాలలు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తి చేశారో వివరాలు చెప్పాలని ఎంపీ నగేశ్ టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులను ప్రశ్నించగా.. వారు వివరాలు చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తలమడుగు మండలం సుంకిడి పాఠశాల సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉట్నూర్మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు చాలా చోట్ల ప్రారంభం కాలేదని ఎంపీపీ జైవంత్ రావు సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. యాపల్‌గూడ పాఠశాల నిధుల్లో అవకతవకలు జరిగాయని హెచ్ఎంపై విచారణ జరిపించాలని ఎంపీపీ గండ్రత్రమేశ్ డిమాండ్ చేశారు. జైనథ్ మండల ప్రభుత్వ పాఠశాలలో ఆరు నెలల క్రితం పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారని, కానీ ఇంతవరకు రిపేర్లు చేయలేదన్నారు. భారీ వర్షాలు కురిస్తే ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని వెంటనే నూతన గదులు నిర్మించాలని డిమాండ్ చేశారు.
బజార్హత్నూర్ మండలం కొల్హారీ వంతెన కూలిపోయి ఏండ్లు గడుస్తున్నాయని, ప్రభుత్వం నూతన బ్రిడ్జి మంజూరు చేసినా పనులు పూర్తికావడం లేదని జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య అన్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నిధుల లేమితో ఆగిన అభివృద్ధి: పాయల్‌శంకర్
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఆదిలాబాద్నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో డాక్టర్లను నియమించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే నియమించాలన్నారు. గ్రామాల్లో పీఆర్రోడ్లు ఉండడం కారణంగా కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించలేకపోతున్నామని, ఆ రోడ్లను ఆర్‌అండ్‌బీకి మార్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు నిధులు వచ్చేలా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. పలు సమస్యలను ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు: అనిల్ జాదవ్
పోడు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ప్రభుత్వ టీచర్లు బదిలీల్లో పట్టణ ప్రాంతాల్లోకి వెళ్తున్నారని, నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో ఉపాధ్యాయులు లేక గిరిజనులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గిరిజన స్కూళ్లలో టీచర్లను నియమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
రోడ్ల పరిస్ధితి దారుణంగా ఉంది: కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లు, లోలెవల్వంతెనల పరిస్థితి దారుణంగా ఉందని కోవ లక్ష్మి అన్నారు. రోడ్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయని, ఆదిలాబాద్ నుంచి అనార్పల్లి మీదుగా కెరమెరి వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులు నిలిచిపోవడంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో రోడ్ల సమస్య మరీ ఎక్కువగా ఉందన్నారు. సమస్యపై ప్రభుత్వానికి నివేదిస్తామని, నిలిచిపోయిన రహదారి పనులను అధికారులు పూర్తి చేయాలని కోరారు.