- ఆన్ లైన్ చేయక గొల్లకుర్మలు నష్టపోతున్రు..
- హుజూర్ నగర్ లో ఒక్క లిఫ్ట్ కూడా పనిచేస్తలె
- చెరువుల్లో చేప పిల్లలు వేయడంలో నిర్లక్ష్యమేంటి?
- సూర్యాపేట జడ్పీ మీటింగ్‌లో ఆఫీసర్లను నిలదీసిన ప్రజాప్రతినిధులు
సూర్యాపేట వెలుగు : మిల్లులను అలాట్ చేయకుండా వడ్లు ఎలా కొనుగోలు చేయాలంటూ ప్రజాప్రతినిదులు అధికారులను నిలదీశారు. కొన్ని గ్రామాలలో ఐకేపీ సెంటర్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఐకేపీ సెంటర్ కింద సబ్ సెంటర్ ఓపెన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జాజిరెడ్డి గూడెం మండలంలో వీకేపీ అక్రమాలు చేసినట్లు సోషల్ ఆడిట్ లో తేలినా నేటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని, కనీసం రికవరీ కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హుజూర్ నగర్ లో ఉపాధి హామీ పనులతో రోడ్లు వేయకుండానే బిల్లు ఎత్తారని ఎంపీపీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మూడేళ్ల నుంచి ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ రావడం లేదని, మాడా కింద గిరిజనులకు లోన్లు శాంక్షన్ అయిన అధికారులు నేటికీ మంజూరు చేయలేదని తెలిపారు. చిలుకూరు పీహెచ్‌సీలో డాక్టర్ లేకపోవడంతో, మేళ్లచెర్వు పీహెచ్‌సీలో డాక్టర్ రాకపోవడంతో పేషెంట్లు పక్క మండలానికి వెళ్లి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీ కోసం అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో 1300 మంది గొల్లకుర్మల పేర్లు ఆన్ లైన్ చేయకపోవడంతో వారు అర్హత కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే వారి పేర్లను ఆన్ లైన్ చేయాలని అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీర ప్రసాద్ డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఒక్క లిఫ్ట్ కూడా పని చేయడం లేదని, కనీసం రిపేర్లు కూడా చేయడం లేదని అధికారుల దృష్టికి తెచ్చారు. పులిచింతల బ్యాక్ వాటర్ తో పాటు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఒక్క చెరువులో కూడా అధికారులు చేప పిల్లలను వదలకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పెదవీడు కమ్యూనిటీ హాల్ మంజూరై మూడేళ్లు దాటినా నేటికీ పనులు చేపట్టలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ యస్. మోహన్ రావు, జడ్పీ సీఈఓ సురేశ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రెండు తీర్మానలకు ఆమోదం
జాతీయ స్థాయిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ, పంచాయితీ మహిళా స్నేహ పూర్వక అవార్డులతో పాటు రూ.కోటి నగదు పొందిన సూర్యాపేట జిల్లాకు చెందిన ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామానికి అభినందనలు తెలుపుతూ తీర్మానాన్ని జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక ప్రవేశ పెట్టారు. జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్ ఆమోదం తెలిపారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని సచివాలయం పక్కన 125 అడుగుల భారీ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు ధన్యవాద తీర్మానం పెట్టారు. దీనిని తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్, సూర్యాపేట జడ్పీటీసీ జీడి భిక్షం బలపర్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా గిరిజానాభివృద్ధి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, జిల్లా పశు సంవర్ధక, మిషన్ భగీరథ, నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి, విద్యుత్, ఎస్సీ అభివృద్ధి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలపై సుదీర్గంగా చర్చించారు.