న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ.1.5 లక్షల కోట్లను దాటుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎన్‌పీఏలు తగ్గడం, అప్పులివ్వడం పెరగడంతో బ్యాంకుల లాభాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ప్రభుత్వ బ్యాంకులకు రూ.85,520 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది ఇదే టైమ్‌లో వచ్చిన రూ.68,500 కోట్లతో పోలిస్తే 25 శాతం గ్రోత్ నమోదైంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకులకు రికార్డ్ లెవెల్‌లో రూ.1.41 లక్షల కోట్ల నికర లాభం వచ్చిన విషయం తెలిసిందే.
ఇవి ఇచ్చిన అప్పుల్లో గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏల) రేషియో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 3.12 శాతానికి దిగొచ్చింది. 2018 మార్చిలో ఈ నెంబర్ 14.58 శాతంగా రికార్డయ్యింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని మొండిబాకీల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. గత మూడేళ్లలో కేంద్రానికి ప్రభుత్వ బ్యాంకులు రూ.61,964 కోట్ల డివిడెండ్‌ను ఇవ్వడం విశేషం. ఈ ఏడాది సైబర్ మోసాలు కూడా భారీగా పెరిగాయి. కస్టమర్లు ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో రూ.11,333 కోట్లు నష్టపోయారు.