
భారతదేశంలో ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ షేర్లను అమ్మి తద్వారా నిధులు సమకూర్చేవిధంగా కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఇందులో కోల్ ఇండియా ముందు వరుసలో ఉన్నది. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వరంగంలో ఒక లక్షమందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటీ రాలేదు. మరోవైపు ఉపాధి కల్పిస్తున్న సంస్థలను కార్పొరేట్లకు లీజుకు ఇవ్వడం లేదా చౌకబారుకు అమ్మి వేయడం చూస్తున్నాం.
పన్నులు వసూలు చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం తమవంతు సహకారం అందించడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేయడం మానేసింది. ప్రభుత్వ సంస్థలను క్రమక్రమంగా అమ్ముకుంటూ వస్తోంది. 2025 చివరినాటికి రూ. 6 లక్షల కోట్ల ఆదాయం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలను, బొగ్గు బ్లాకులను అమ్మి ఆదాయం సమకూర్చుకునే పనిలో కేంద్రం ఉన్నది. 2030 నాటికి ఇలా రూ.10 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వ సంస్థలను అమ్మడం లేదా లీజుకు ఇచ్చి ఆదాయం సమకూర్చేవిధంగా ప్రభుత్వం ప్లాన్ చేసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదికి వచ్చేశారు.
ప్రభుత్వ వాటాల విక్రయం
అమ్మకం జాబితాలో కోల్ ఇండియా, ఎల్‌ఐసి, రైల్ వికాస్ నిగమ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మొదలైన సంస్థలు ఉన్నాయి. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ కంపెనీలలో ప్రభుత్వం తన వాటాను తగ్గిస్తోంది. ఈ సమాచారం మనీ కంట్రోల్ ప్రణాళిక గురించి తెలిసిన ఇద్దరు సీనియర్ అధికారులు అందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పెద్ద కంపెనీలైన కోల్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లలో వాటాను విక్రయించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం, కోల్ ఇండియా లాభదాయక సంస్థ 2024– 25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.10,252.09 కోట్ల డివిడెండ్ చెల్లించే ప్రభుత్వ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా 782 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వాటా కోల్ ఇండియాలో 63.13%, ఎల్ ఐసీలో 96.50%, రైల్ వికాస్ నిగమ్ 72.84%, గోర్డాన్ రీచ్ షిప్ బిల్డర్స్ & ఇంజనీర్స్ 74.50% ఉంది. ఇది మార్చి 2024 చివరినాటి లెక్కకాగా, కోల్ ఇండియా ఇప్పటికే 36.87 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉన్నది. ఈ ఏడాదిలోనే కోల్ ఇండియాలో కేంద్రం మరికొంత వాటాను విక్రయించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఉద్యోగుల వేతన ఒప్పందంలో షేర్ హోల్డర్ల జోక్యం పెరిగింది. రానున్న రోజుల్లో ఇలా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల షేర్లను ప్రభుత్వం అమ్ముతూపోతే రేపు ఉద్యోగుల జీతభత్యాలపైన కూడా కార్పొరేట్స్ ఆధిపత్యం కొనసాగే ప్రమాదం ఉంది. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానం అయిపోయింది. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీలాంటి వారికి విక్రయించి కార్పొరేట్ సంస్థలకు మద్దతుగా నిలబడడమే కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక ధోరణిని అరికట్టాలంటే ప్రజలు పోరాటాలు, ఉద్యమాలు చేస్తే తప్ప దీనిని ఆపలేం.
- ఎండి మునీర్,,
సీనియర్ జర్నలిస్ట్