- ఆఫర్ ఇస్తే చూద్దాంలే!
- ఈ ఏడాదిలో బల్దియాకు తగ్గిన ఆదాయం
- 2 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు
- ఈ నెలాఖరులోపు చేరుకోవడం కష్టమే
- జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్సర్కిళ్ల నుంచి వసూలు తక్కువే
- కరోనా సమయంలోనే కలిసొచ్చిన ఆదాయం
- బిల్కలెక్టర్లపైన ఉన్నతాధికారుల ఒత్తిడి
హైదరాబాద్, వెలుగు: ఈసారి బల్దియాకు ఆస్తి పన్ను తక్కువగానే వచ్చేలా ఉంది. గత రెండేండ్లలో కరోనా కాలంలోనే కలిసొచ్చింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అధికారులు రూ.2 వేల కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ నెలాఖరులోగా చేరుకోవడం కష్టంగానే ఉంది. మరో 18 రోజుల సమయం ఉండగా ఇప్పటివరకు రూ.1,295 కోట్లు మాత్రమే వసూలైంది. ఈనెలాఖరు వరకు ఎంత వసూలైనా లక్ష్యం చేరడం కష్టమేనని బల్దియావర్గాలు పేర్కొంటున్నాయి.
కట్టేందుకు ముందుకు రావట్లే
బల్దియాకు ఆదాయం భారీగా తగ్గిన సమయంలో ఆఫర్ ని ప్రకటించి అధికంగా రాబట్టేందుకు స్కీమ్ లు అమలు చేస్తుంది. దీంతో ఆఫర్లు ఉన్నప్పుడే సిటిజన్లు ఎక్కువగా ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. సాధారణ సమయంలో చెల్లించేందుకు ముందుకు రావట్లేదు. ఇప్పుడు కూడా కొత్త స్కీమ్ లు ప్రవేశపెడితేనే పన్ను వసూలు అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటివరకు కట్టని వారు కూడా ఆఫర్ఇచ్చినప్పుడు చెల్లిద్దాంలే అనుకుని నిర్లక్ష్యంగా ఉంటున్నారు. స్కీమ్‌ల సమయంలో ప్రతి నెల వంద కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఒక్కో నెలలో అత్యధికంగా రూ.200 కోట్ల వరకు వసూలైతుంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ఎర్లిబడ్ స్కీమ్, ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్15 వరకు వన్ టైమ్ స్కీమ్(ఓటీఎస్) అమలు చేయడంతో భారీగా ఆదాయం వచ్చింది. ఈసారి కూడా వచ్చేనెల ఏమైనా ఆఫర్ఇస్తారేమోనని సిటిజన్లు ముందుగానే కట్టకుండా ఎదురుచూస్తున్నారు.
గతేడాది ఓల్డ్ సిటీలో పుల్ కలెక్షన్
ఓల్డ్‌సిటీలోని ఫలక్ నుమా,చార్మినార్, చాంద్రాయణ గుట్ట, సంతోష్ నగర్ సర్కిళ్లలో ప్రతి ఏటా ఆదాయపు పన్ను వసూలు చాలా తక్కువగా ఉండేది. గతేడాది ఆయా ప్రాంతాల్లో డబుల్వసూలైంది. లాస్ట్ ఇయర్ కరోనా సమయంలో రూ.54.34 కోట్లు, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.34 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రతిఏటా అత్యధికంగా వసూలయ్యే జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ సర్కిళ్లలోనే ఈఏడాది ఆదాయం తగ్గింది. ఒక్క శేరిలింగం పల్లి సర్కిలో మాత్రం గతేడాది రూ.167 కోట్లు వస్తే, ఈ ఏడాది రూ.173 కోట్లు వచ్చింది. మిగతా అన్ని సర్కిళ్లలో గతేడాది కంటే తక్కువగానే వసూలైంది.
బిల్ కలెక్టర్లపైన ఒత్తిడి
ఆస్తి పన్ను వసూలులో బిల్ కలెక్టర్లదే కీలక పాత్ర. వీరిపైఉన్నతాధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 380 మంది బిల్ కలెక్టర్లే ఉన్నారు. ప్రతి ఏటా బల్దియాకు వచ్చే ఆస్తిపన్నులో 40 శాతం వీరే వసూలు చేస్తారు. వారి సంఖ్యను డబుల్చేస్తే మరింత ఆదాయం వచ్చే అవకాశముంది. కానీ ఉన్నాతాధికారులు మాత్రం వారిని అదనంగా పెంచడంలేదు.