తెల్లాపూర్​లో గద్దర్ విగ్రహ ఏర్పాటు అడ్డగింత

తెల్లాపూర్​లో గద్దర్ విగ్రహ ఏర్పాటు అడ్డగింత
  • హెచ్ఎండీఏ పర్మిషన్​ తీస్కోవాలని పోలీసుల సూచన
  • డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకెళ్లిన అఖిలపక్షం నేతలు

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​లో గురువారం అఖిలపక్షం నాయకులు ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సదరు స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందని, తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. దీంతో కొంతసేపు హైడ్రామా నడిచింది. ఆ వెంటనే వివిధ పార్టీల, యూనియన్ల నాయకులు రామచంద్రాపురం పీఎస్​కుచేరుకొని పోలీసులతో మాట్లాడారు.

హెచ్​ఎండీఏ ఆఫీసర్ల ఫిర్యాదు మేరకే పనులను అడ్డుకున్నామని, నిబంధనల ప్రకారం పర్మిషన్లు తీసుకొని కార్యక్రమం చేసుకోవాలని పోలీసులు సూచించారు.  ఈ నెల 31న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించి, దిమ్మెపై విగ్రహం పెడుతుండగా అడ్డుకున్నారు. అయితే పాట కోసం 50 ఏళ్లు జీవితాన్ని ధారబోసిన గద్దర్​కు కృతజ్ఞతగా, ఆయన పాటకు పట్టాభిషేకం జరగాల్సిందేనని అఖిలపక్షం నేతలు చెప్పారు.

ఎట్టి పరిస్థితితుల్లో ఈ నెల 31న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ అనవసరపు సమస్యలు సృష్టిస్తోందని, విగ్రహ ఏర్పాటు కోసం పాలక మండలి ఎప్పుడో తీర్మానం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో కవి, రచయిత డాక్టర్ పసునూరి రవీందర్, బుచ్చిరెడ్డి, అరుణ్ గౌడ్​, దేవేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.