పులిచింతల డ్యాంలో గేటు అమర్చిన అధికారులు

అమరావతి: పులిచింతల ప్రాజెక్టు డ్యామ్ వద్ద కొట్టుకుపోయిన 16వ నంబరు గేటు స్తానంలో స్టాప్ లాక్ గేటును అధికారులు ఎట్టకేలకు అమర్చారు. సుమారు 80 మందికిపైగా సిబ్బంది దాదాపు 20 గంటలపాటు శ్రమించి గేటును విజయవంతంగా అమర్చారు. నిన్న రాత్రి 1 గంట వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో 11ఎలిమెంట్లను అమర్చిన టెక్నికల్ సిబ్బంది కొద్దిసేపటి క్రితం 16వ నెంబర్ స్టాప్ లాక్ గేటు అమరికను విజయవంతంగా పూర్తి చేశారు. 
ఈనెల 6వ తేదీన ఎగువ నుండి భారీగా వరద రావడంతో డ్యామ్ గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తుండగా 16వ గేటు వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. 16వ నెంబరు గేటుతోపాటు మోటారు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో తిరిగి గేటు అమర్చాలంటే డ్యామ్ మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చింది. గేటును వెంటనే అమర్చడం కోసం దిగువ ప్రాంతాల వారిని హెచ్చరిస్తూ గేటు అమరికను చేపట్టారు అధికారులు. గేటు ఏర్పాటుకు అడ్డులేకుండా చేసేందుకు ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిలో ఎక్కువ భాగం నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు రోజుల వ్యవధిలో 40 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేసి గేటు అమరిక పనులు చేపట్టారు.

పులిచింతల ప్రాజెక్టు తిరిగి డెడ్ స్టోరేజీకి అంటే 5 నుంచి 6 టీఎంసీలకు చేరిన తర్వాత గేటు అమరిక పనులు వేగం పుంజుకున్నాయి. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం 16వ నెంబరు క్రస్ట్ గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పూర్తిచేసి తిరిగి నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టులో అన్ని గేట్లు మూసి నీటి నిల్వను ప్రారంభించారు. ఎగువన నాగార్జున సాగర్ నుండి వస్తున్న 40వేల క్యూసెక్కుల నీటిని పులిచింతల రిజర్వాయర్ లోనే నిలిపేస్తున్నారు.