నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌‌కు ఇన్‌‌ఫ్లో భారీ మొత్తం వస్తోంది. నాగార్జునసాగర్‌‌ గేట్లను ఓపెన్‌‌ చేయడంతో ఎగువ నుంచి 3,31,970 క్యూసెక్కుల వరదల వస్తుండగా 17 గేట్లను ఎత్తి 4,43,551 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌‌లో ప్రస్తుతం 45.77 టీఎంసీలకు గానూ 33.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు తెలిపారు.

నవ్యను పరామర్శించిన కోమటిరెడ్డి

నల్గొండ అర్బన్​, వెలుగు : ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురై నల్గొండలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న నవ్యను గురువారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, హాస్పిటల్‌‌ బిల్లును ఆయనే చెల్లించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దాడికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌‌ చేశారు. మహిళలు, యువతులపై దారుణాలు జరగకుండా షీటీమ్స్‌‌, పోలీసులు సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. నవ్య ట్రీట్‌‌మెంట్‌‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. 

కౌన్సిల్‌‌ మీటింగ్‌‌ను బహిష్కరించిన బీజేపీ, కాంగ్రెస్‌‌ కౌన్సిలర్లు

చౌటుప్పల్‌‌, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌లో గురువారం నిర్వహించిన మున్సిపల్‌‌ మీటింగ్‌‌ను బీజేపీ, కాంగ్రెస్‌‌ కౌన్సిలర్లు బహిష్కరించారు. చైర్మన్‌‌ వెన్‌‌రెడ్డి రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడంటూ ఆఫీస్‌‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అంతకుముందు సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ ఫ్లోర్‌‌ లీడర్‌‌ శ్రీధర్‌‌ బాబు మాట్లాడారు. ప్రజా సమస్యలను ఎజెండాలో చేర్చలేదని, చైర్మన్‌‌ తన వ్యక్తిగత ఎజెండాను అమలుపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనతో పాటు, కౌన్సిలర్లు నాగరాజు, బండమీది మల్లేశం, చందగల విజయ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రతి నెలా జరగాల్సిన మీటింగ్‌‌ను మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నారని, సమస్యలు ఉన్న వార్డులను వదిలి చైర్మన్‌‌ తన సొంత వార్డుకు రూ. 70 లక్షలు కేటాయించుకున్నారని ఆరోపించారు. పట్టణ ప్రగతి బిల్లులను చెల్లించడం లేదన్నారు. వీరు నలుగురు బయటకు వెళ్లినప్పటికీ కోరం ఉండడంతో సమావేశం యథావిధిగా కొనసాగింది.

అంగన్‌‌వాడీ సెంటర్లకు వంటసామగ్రి పంపిణీ

మునుగోడు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడులోని అంగన్‌‌వాడీ సెంటర్లకు కస్తూరి ఫౌండేషన్‌‌ ఆధ్వర్యంలో గురువారం వంటసామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌‌ చైర్మన్‌‌ చరణ్‌‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తమ వంతుగా సాయం చేస్తామన్నారు. అంగన్‌‌వాడీ సెంటర్లకు సొంత బిల్డింగ్‌‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి బిల్డింగ్‌‌లు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌ మిర్యాల వెంకన్న, శంకర్‌‌రెడ్డి పాల్గొన్నారు.

నార్మల్‌‌ డెలివరీలు పెంచాలి

తుంగతుర్తి, వెలుగు : ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో నార్మల్‌‌ డెలివరీల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని సూర్యాపేట డీఎంహెచ్‌‌వో కోట చలం సూచించారు. తిరుమలగిరి పీహెచ్‌‌సీని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌‌సీలో వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. సీజనల్‌‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు.  ప్రశాంత్‌‌బాబు, సీహెచ్‌‌వో బిచ్చు నాయక్, సూపర్‌‌వైజర్‌‌ రామచంద్రు, స్వరూపాకుమారి పాల్గొన్నారు.