- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వెల్లడి
- జిల్లా అధికారులతో కలిసి సందర్శన
పెనుబల్లి, వెలుగు : పులిగుండాల ప్రాజెక్టును ఎకో టూరిజం హబ్ గా ఫిబ్రవరి నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం కలెక్టర్ సత్తుపల్లి డివిజన్ తల్లాడ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ పులిగుండాల ప్రాజెక్ట్ ను ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి పరిశీలించారు.
అడవి 5 కిలోమీటర్లు కాలినడకన నడిచి గుట్టపైకి ఎక్కి పులిగుండాల వెళ్లారు. జిల్లాలో ఎకో టూరిజం ప్లాన్ లో భాగంగా కలెక్టర్ జీపులో ప్రయాణించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పాలపిట్ట ఏరియల్ టవర్ ఎక్కి అటవీ ప్రాంతాన్ని చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి సంపద అయిన అడవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు.
పులిగుండాల ప్రాజెక్టును ఆహాద్లం పంచే విధంగా ఏర్పాట్లు చేసి పర్యాటకులకు ఆకర్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెరువులో బోటింగ్, కాటేజ్ లు, భోజనం, తాగునీరు వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. పులిగుండాల చరిత్ర చెప్పే విధంగా గైడ్ లను కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. పిల్లలకు సైక్లింగ్, ఓపెన్ జిమ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటివి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జెడ్పీ సీఈవో దీక్షా రైనా, అటవీ అభివృద్ధి అధికారి మంజుల, అటవీ రేంజ్ అధికారి జి. నాగేశ్వరరావు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.