
- క్వాలిటీ కందిపప్పు కిలో రూ.185 నుంచి 150కి తగ్గుదల
- మధ్యరకం రూ.140 నుంచి రూ.120లోపే
- పెసర, మినప, శనగ పప్పుల రేట్లు కూడా డౌన్
- రాష్ట్రంలో పప్పు దినుసుల సాగు పెరగడమే కారణం
- ఈ ఏడాది 5,90,209 ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు
- తగ్గుతున్న ధరలతో సామాన్యులకు ఊరట
హైదరాబాద్, వెలుగు: నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. పప్పుల రేట్లు మూడు నెలల క్రితం వరకు నాన్‌వెజ్ తో పోటీపడ్డాయి. దీంతో పప్పులు కొనాలంటేనే జనం భయపడేవారు.
కానీ రాష్ట్రంలో ఏడాదిగా పప్పుధాన్యాల సాగు పెరగడం, మార్కెట్లకు పెద్ద ఎత్తున పప్పులు తరలి వస్తుండటంతో రేట్లు తగ్గుముఖం పట్టాయి. గతంలో రాష్ట్రంలో అపరాల (పప్పు ధాన్యాలు)సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల పప్పుల రేట్లు పెరిగాయి.
దిగుమతుల మీదే ఎక్కువగా ఆధారపడడం వల్ల కూడా వ్యాపారులు పప్పులను బ్లాక్చేస్తూ రేట్లను పెంచి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో క్రమంగా ధరలు తగ్గుతున్నాయని ఎక్స్పర్ట్ లు చెప్తున్నారు.
పెరిగిన అపరాల సాగు
రాష్ట్రంలో రెండేండ్లుగా అపరాల (పప్పుధాన్యాలు) సాగు పెరుగుతోంది. గతేడాది 5 లక్షల 24 వేల 595 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి 5 లక్షల 90 వేల 209 ఎకరాల్లో అపరాల సాగు చేపట్టారు. అంటే గతంతో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే 65,614 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది.
గతేడాదితో పోలిస్తే కంది 43 వేల 444 ఎకరాల్లో, పెసర19 వేల ఎకరాల్లో, మినుములు 3 వేల ఎకరాల్లో అదనంగా సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అపరాల సాగు అత్యధికంగా నమోదైంది.
వికారాబాద్ జిల్లా తాండూరు కంది పప్పుకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కానీ రాష్ట్రంలో మార్కెట్లన్నీ దళారులు చేతుల్లో ఉండడంతో అపరాలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టి.. రైతులకు ఎంఎస్పీ దక్కేలా చూస్తేనే పప్పుధాన్యాల సాగు పడిపోకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
6 నెలల క్రితం కందిపప్పు రూ.200
ఆరు నెలల క్రితం మార్కెట్ లో క్వాలిటీ కందిపప్పు కేజీ రూ.185 నుంచి 200 వరకు పలికింది. డబుల్ సెంచరీ దాటడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఒకానొక దశలో నాణ్యమైన కంది పప్పు కిలో రూ.240 దాకా పలికింది.
ప్రస్తుతం నాణ్యమైన కందిపప్పు హోల్ సేల్ మార్కెట్లో కేజీ రూ.150 ఉండగా..రిటైల్ గా రూ.160కు దొరుకుతోంది. ఇందులోనే మధ్యరకం హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.130 ఉండగా.. రిటైల్ షాపుల్లో కిలో రూ.140 నుంచి రూ.120 వరకు దొరుకుతోంది.
ఇంకా క్వాలిటీ తక్కువుండే కందిపప్పు హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.90 నుంచి రూ.95 వరకు అమ్ముతుండగా.. రిటైల్ షాపుల్లో రూ.110 నుంచి రూ.125 వరకు దొరుకుతోంది.
ఇతర పప్పుల రేట్లు ఇలా..
నాణ్యమైన శనగ పప్పు గతంలో కేజీ రూ.150 ఉండగా.. ప్రస్తుతం హోల్ సేల్‌గా రూ.100 నుంచి రూ.125 మధ్య, రిటైల్ గా కిలో రూ.115 నుంచి రూ.135 వరకు విక్రయిస్తున్నారు. ఇందులోనే మధ్యరకం పప్పు హోల్ సేల్ మార్కెట్లో రూ.70 నుంచి రూ.75 ఉండగా.. రిటైల్ గా కిలో రూ.90 వరకు పలుకుతోంది. నాణ్యమైన మినప పప్పు గతంలో160 వరకు పలకగా.. ప్రస్తుతం హోల్‌సేల్‌లో కేజీ రూ.145 , రిటైల్ లో రూ. 150 వరకు అమ్ముతున్నారు.
మధ్యరకం మినప పప్పు(గుండు) హోల్ సేల్ లో రూ.120 ఉండగా.. రిటైల్ లో 130 వరకు పలుకుతోంది. మైసూర్ (ఎర్రపప్పు) గతంలో కిలో రూ.130 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో హోల్ సేల్‌లో కేజీ రూ.95, రిటేల్‌లో రూ.100 నుంచి రూ.115 వరకు అమ్ముతున్నారు.
ఇందులో మధ్యరకం హోల్ సేల్‌గా రూ.75 నుంచి రూ.80, రిటేల్ గా రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. వేరుశనగ గతంలో కేజీ రూ.140 వరకు విక్రయించగా.. ప్రస్తుతం హోల్ సేల్‌లో రూ.120, రిటేల్ గా రూ.135కు అమ్ముతున్నారు. ఓవరాల్‌గా చూస్తే పప్పుల ధరలు కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు తగ్గాయని చెబుతున్నారు.