హైదరాబాద్, వెలుగు : కందిపప్పు రేటు అమాంతం పెరిగింది. గడిచిన నెల రోజుల్లోనే రూ.20 నుంచి రూ.25 వరకు ధర పెరిగింది. నిరుడు కందిపంట ఎక్కువ మొత్తంలో సాగుకాలేదు. డిమాండ్‌కి సరిపడా లభించకపోవడంతో ఆ ప్రభావం రేట్లపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ.180 పలుకుతున్నది. హోల్‌సేల్ మార్కెట్లయిన బేగం బజార్, దాల్మార్కెట్ లలో కిలో రూ.160 నుంచి రూ.170 వరకు పలుకుతోంది. ఇక్కడి నుంచి కొనుక్కుని వెళ్తున్న వ్యాపారులు.. కిలోకు పది నుంచి ఇరవై రూపాయలు పెంచి అమ్ముతున్నారు.
రానున్న రోజుల్లో కందిపప్పు ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. నిరుడు ఇదే సీజన్లో కిలో కంది పప్పు రూ.100 వరకు ఉండేది. ఇక మార్ట్ లలో కందిపప్పు కిలో రూ.164 గా విక్రయిస్తున్నారు. దీంతో మార్ట్ లలో సరుకు క్షణాల్లోనే ఖాళీ అవుతున్నది. ఉదయం మార్ట్ లు తెరిచినపుడు స్టాక్ ఫుల్ గా ఉంటున్నప్పటికీ కొద్ది గంటల్లోనే ఖాళీ అవుతున్నది.
ప్రస్తుతం హైదరాబాద్ లోని మెజారిటీ మార్ట్ లలో ఇదే పరిస్థితి ఉంది. ఇదేంటని అడిగితే తమ వద్ద స్టాక్ లేదని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. మధ్యాహ్నం తరువాత మార్ట్ లకు పోతే కందిపప్పు లభించని పరిస్థితి ఏర్పడింది. కొన్ని మార్ట్ లలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.
డిమాండ్‌కు సరిపడా దిగుమతుల్లేవు
ఈ ఏడాది డిమాండ్ కి సరిపడా కందిపప్పు దిగుమతి కావడం లేదు. పంట తక్కువగా సాగుచేయడంతో పాటు నిరుడు వర్షాభావ ప్రభావంతో కంది సాగు తగ్గిందని, ఈ నేపథ్యంలోనే రేట్లు పెరుగుతున్నాయని దాల్ మిల్లర్స్, వ్యాపారులు చెబుతున్నారు. అలాగే టాంజానియా, సూడాన్, కెన్యా, మయన్మార్ వంటి దేశాల నుంచి కందిపప్పు దిగుమతులు తగ్గాయని, దీని ప్రభావం ధరలపై పడిందని పేర్కొన్నారు. ఆరు నెలలుగా దిగుమతులు బాగా తగ్గాయని తెలిపారు. డిమాండ్ ఇలాగే ఉంటే రేట్లు ఇంకా పెరగవచ్చని చెప్పారు.