
సిద్దిపేట, వెలుగు: రంగనాయక సాగర్ లోకి మిడ్ మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసి యాసంగి పంటకు సాగు నీళ్లివ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు.. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు. మూడేండ్లుగా సిద్దిపేట జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా నీళ్లు అందివ్వడంతో పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్ లో లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారని వివరించారు.
యాసంగి పంటకు నీళ్లు అందించాలంటే రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో మూడు టీఎంసీలు ఉండాలని లేఖలో పేర్కొన్నారు. కానీ.. ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో 1.50 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, జిల్లా రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్ మానేరు నుంచి 1.50 టీఎంసీల నీటిని సాగర్ కు వచ్చేలా పంపింగ్ చేయాలని కోరారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ సందర్భంగా హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.