తాగి ఉన్నా.. ఏం గుర్తులేదు!

తాగి ఉన్నా.. ఏం గుర్తులేదు!
  • పోలీసుల ప్రశ్నకు పుణె కారు ప్రమాద నిందితుడి రిప్లై

ముంబై: మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ చేసిన కారు యాక్సిడెంట్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన బాలుడి(17)ని పోలీసులు విచారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి అసలు ఏమైందో చెప్పాలని టీనేజర్ ను అధికారులు ప్రశ్నించారు. తాను మద్యం మత్తులో ఉండటంతో ఆరోజు ఏం జరిగిందనేది తనకు గుర్తులేదని టీనేజర్ చెప్పినట్లు పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించాయి.

ప్రమాదానికి కొద్దిసేపటి ముందు మైనర్ నిందితుడు తన ఫ్రెండ్స్ తో  కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు..90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలింది. అనంతరం ఇంటికి వెళ్తుండగా ఓ బైక్ ను కారుతో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ టీనేజర్ ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉన్నాడు. అతడిని మేజర్ గా పరిగణించి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతినివ్వాలని పోలీసులు ఇప్పటికే కోర్టును కోరారు.

కాగా.. బ్లడ్ టెస్ట్ లో మద్యం ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకు అతడి తల్లి తన రక్త నమూనాలు ఇచ్చినట్లు కూడా నిర్ధారణ అయ్యింది. ఆమెతో పాటు కేసు విచారణను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించిన బాలుడి తండ్రిని, తాతను కూడా  పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం మూడు కేసులు  ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లు కాగా.. పలు బృందాలు దర్యాప్తులో భాగమయ్యాయి.