
పుణేలో దారుణం చోటు చేసుకుంది.. అది నిత్యం రద్దీగా ఉండే స్వరగేట్ బాస్ స్టాండ్.. అక్కడ ఆగి ఉన్న ఓ బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. నగరం నడిబొడ్డున ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం జరగటం కలకలం రేపింది. మంగళవారం ( ఫిబ్రవరి 25, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. బాధితురాలు ఔంధ్-బనేర్ ప్రాంతంలో నివసిస్తూ.. ఆసుపత్రిలో కౌన్సెలర్‌గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో, ఆమె ఫల్తాన్‌కు వెళ్లే బస్సు కోసం వేచి చూస్తుండగా.. నిందితుడు ఆమె వద్దకు వచ్చి బస్సు మరొక ప్లాట్‌ఫామ్‌కు దగ్గరకు వచ్చిందని చెప్పి నమ్మించాడు. నిందితుడి మాటను నమ్మిన మహిళ అతని వెంట చీకట్లో ఆగి ఉన్న ఖాళీ బస్సు దగ్గరకు వెళ్ళింది.
అక్కడ ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ అతన్ని ప్రశ్నించగా.. బస్సు లోపల చాలా మంది ప్రయాణికులు కూర్చున్నారని చెప్పిన నిందితుడు.. ఆమె బస్సులోకి ప్రవేశించగానే బస్సును లోపలి నుండి లాక్ చేసి, ఆమెపై అత్యాచారం చేసి, అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు పోలీసులు. ఘటన జరిగిన ప్రదేశంలోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని తెలిపారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని తెలిపారు.
ఘటన జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడిన మహిళ స్నేహితుడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులుల్ 8 మంది బృందాలతో దర్యాప్తు జరిపి నిందితుడిని గుర్తించామని తెలిపారు పోలీసులు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు పోలీసులు.