
పుణె: మహారాష్ట్రలోని పుణెలో పార్క్చేసిన బస్సులో యువతిపై అత్యాచారం చేసి, పరాడైన యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన 75 గంటల తర్వాత నిందితుడు దత్తాత్రేయ గాడే (37)ను అదుపులోకి తీసుకున్నారు. అతని కోసం 500 మందికిపైగా పోలీసులతో 13 బృందాలు, డ్రోన్స్, డాగ్ స్వ్కాడ్స్‌తో పుణె జిల్లా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఘటన జరిగిన తర్వాత అక్కడక్కడా తిరిగి, గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో బంధువుల ఇంటికి వెళ్లాడు.
అక్కడి వారితో ‘నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను లొంగిపోతాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం బంధువుల ఇంటికి దగ్గర్లోని చెరుకు తోటలో దత్తాత్రేయ దాక్కున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్ సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
గతంలో పలు కేసులు నమోదు..
పుణె జిల్లా శ్రీరూర్‌కు చెందిన దత్తాత్రేయ గాడేపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 6 కేసులు నమోదయ్యాయి. 2019లో అతను ఓ ట్యాక్సీని కొనుగోలు చేసి.. పుణె, అహిల్యా నగర్ మార్గాల్లో తిప్పేవాడు. బంగారు నగలు వేసుకున్న వృద్ధులను తన కారులో ఎక్కించుకొని, ఎవ్వరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి, వారిని బెదిరించి దోచుకునేవాడని పోలీసులు తెలిపారు. 2020లో ఓ దోపిడీ కేసులో 6 నెలలు జైల్లో ఉన్నాడని చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతలతో కలిసి ఫొటోలు దిగి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడన్నారు.
నిందితుడు తరచుగా పుణెలోని సర్వ్గేట్ బస్టాప్ వద్ద తిరుగుతూ.. అక్కడున్న వారితో తనకు తాను పోలీసు ఆఫీసర్‌గా పరిచయం చేసుకునేవాడని విచారణలో తెలింది. ఘటన జరిగిన రోజు కూడా అతను నీట్‌గా డ్రెస్ చేసుకొని, షూస్ వేసుకొని ఉన్నాడని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. యువతితో కూడా తాను పోలీసు అధికారినంటూ పరిచయం చేసుకొని, బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.