ముంబై: వీర్ సావర్కర్‌పై వివాదస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి పూణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం (జనవరి 10) బెయిల్ మంజూరు చేసింది. 2024 ఆరంభంలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. కొంతమంది స్నేహితులతో కలిసి ఒక ముస్లిం వ్యక్తిని కొట్టామని.. ఈ ఘటన నాకు సంతోషాన్ని ఇచ్చిందని వీడీ సావర్కర్ ఒక పుస్తకంలో రాశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సావర్కర్ ముని మనవడు సాత్యకి సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం, అబద్ధం, దురుద్దేశపూరితమైనవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కామెంట్స్ తన ముత్తాత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని సాత్యకి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు. సాత్యకి ఫిర్యాదు మేరకు పుణె కోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. విశ్రాంబాగ్ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టి రాహుల్ వ్యాఖ్యలు నిజమేనని నిర్ధారించారు.
ALSO READ | అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ ఆస్పత్రిలో చేరాడు.. సీరియస్ అంట..!
దీంతో ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ పుణె ప్రత్యేక కోర్టు ఆశ్రయించాడు. రాహుల్ గాంధీ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం (జనవరి 10) విచారణ చేపట్టిన పుణె స్పెషల్ కోర్టు.. కాంగ్రెస్ అగ్రనేతకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, గతంలో మోడీ ఇంటి పేరున్న వారి అవినీతి పరులంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీ కోర్టు శిక్ష విధించడంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయ్యింది.