చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!

ఒకవైపు వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్స్ పై వివాదం చెలరేగుతున్న వేళ.. అదే సంస్థ నుంచి ఉద్యోగి రిజైన్ చేసి.. కారణాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ గా మారింది. ఎలాంటి బ్యాకప్ లేకుండా అంటే.. వేరే ఉద్యోగం వెతుక్కోకుండానే తన జాబ్ కు రిజైన్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ తన రాజీనామాకు గల ఆరు కారణాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. చాలా మంది ఎంప్లాయిస్ అతినికి మద్ధతుగా నిలుస్తున్నారు. 

ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్నపుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నానని, అందుకే చేతిలో మరో ఉద్యోగం లేకపోయినా ధైర్యం చేసి రిజైన్ చేస్తున్నట్లుగా తెలిపాడు. ఈ సమస్యలను బహిర్గతం చేయాలనుకుంటున్నానని, ఎందుకంటే కార్పోరేట్ వర్క్ స్పేస్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అందరి దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని భూపేంద్ర లెటర్ లో పేర్కొన్నాడు. 

రిజైన్ చేయడానికి గల ఆరు కారణాలు:

1. ప్రమోషన్ వచ్చినా జీతం పెంచరు: 
మూడేళ్లుగా ఇన్ఫోసిస్ లో సిస్టమ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న తనకు ప్రమోషన్ ఇచ్చారు గానీ, సాలరీ పెంచలేదు. మూడేళ్లు సంస్థకు సేవలందిస్తే ప్రమోషన్ ఇచ్చి మరిన్ని బాధ్యతలు, వర్క్ లోడ్ పెంచారు కానీ.. జీతం పెంచకపోవడం దారుణం

2. ఉద్యోగస్తులను తగ్గించి పని ఒత్తిడి పెంచుతున్నారు:
తన టీం 50 నుంచి 30 మందికి తగ్గిపోయింది.  కానీ వర్క్ లోడ్ మాత్రం అలాగే ఉంది. 50 మంది పనిని 30 మందితో చేయిస్తున్నారు. కొత్త ఎంప్లాయిస్ ని తీసుకోరు.. సరైన సోపర్ట్ ఉండదు. చేసిన పనికి గుర్తింపు ఉండదు. 

3. ఎదగడానికి ఎలాంటి అవకాశం లేదు:
లాస్ మేకింగ్ కంపెనీకి చెందిన అకౌంట్ లేదా ప్రాజెక్టు ఇస్తారు. దీంతో సాలరీ పెరుగుదల ఉండదు. కంపెనీ గ్రోత్ లేనపుడు సాలరీ హైక్ ఎలా ఉంటుందని మేనేజర్ స్థాయి వ్యక్తులు డిస్కరేజ్ చేస్తుంటారు. 

4. తీవ్ర ఒత్తిడి.. ఎక్కువ అంచనాలు:
క్లైంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, పదే పదే క్లైంట్స్ తో డిస్కషన్స్ చేసి ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతారు. టార్గెట్స్ పెంచి ఎంప్లాయిని తక్కువ టైమ్ లో ఎక్కువ అంచనాలు క్రియేట్ చేస్తారు. దీంతో వర్క్ లోడ్ పెరిగి చాలా ఒత్తిడికి గురవుతున్నాం. 

5. గుర్తింపు లేదు:
చేసిన పనికి సీనియర్లు మెచ్చుకుంటారు. కానీ సాలరీ పెంచడానికి ఎవరూ రెకమెండ్ చేయరు. కంపెనీలో అందరి పరిస్థితి ఇదే. హార్డ్ వర్క్ చేస్తే ఎలాంటి రివార్డ్ ఉండదు.. కానీ ఏదో ఒక వంకతో సాలరీ పెంచకుండా ఆపుతారు. 

6. ప్రాంతీయ భేదం:
కంపెనీలో ప్రాంతీయ భేదాలు చూపుతారు. భాష, ప్రాంతాల ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయి. పని, ట్యాలెంట్ ఆధారంగా ఎలాంటి గుర్తింపు.. సాలరీ హైక్స్ ఉండవు. 

కంపెనీని.. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే కనీసం 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే 70 గంటలు తర్వాత సంగతి కానీ.. ముందు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయండని భూపేంద్ర లెటర్ చదివిన వారు కామెంట్స్ చేస్తున్నారు.