Pune woman: పాపం ఈ యువతి.. ఓవర్టేక్కు దారివ్వలేదని ముఖం పచ్చడి చేశాడు..!

Pune woman: పాపం ఈ యువతి.. ఓవర్టేక్కు దారివ్వలేదని ముఖం పచ్చడి చేశాడు..!

పుణె: మహారాష్ట్రలోని పుణెలో దారుణం జరిగింది. ఓవర్టేక్ చేసేందుకు దారివ్వలేదని 27 ఏళ్ల మహిళపై 57 ఏళ్ల వృద్ధుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆమె ముఖంపై దాడి చేసిన వృద్ధుడు రక్తం కళ్లజూశాడు. దాడి జరిగిన అనంతరం సదరు మహిళ ఇన్స్టాగ్రాంలో వీడియో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్గా మారింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జెర్నిల్ డిసిల్వ (27) పుణెలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తోంది. డిసిల్వకు శనివారం సెలవు కావడంతో రెస్టారెంట్లో లంచ్ చేయాలని డిసైడ్ అయింది. తాను ఉంటున్న అపార్ట్మెంట్లో ఉండే ఇద్దరు పిల్లలను స్కూటీపై ఎక్కించుకుని హడప్సర్ నుంచి బనెర్ రెస్టారెంట్కు బయల్దేరింది. బనెర్ రోడ్ లో ఆమె స్కూటీపై వెళుతుండగా ఒక వైట్ కలర్ కార్ ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది. 57 ఏళ్ల వృద్ధుడు ఆ కారును నడుపుతుండగా పక్క సీటులో అతని భార్య కూర్చుని ఉంది. ఓవర్ టేక్ చేసేందుకు డిసెల్వ అవకాశం ఇచ్చి స్కూటీని పక్క నుంచి నడుపుతూ వెళ్లింది. అయినప్పటికీ 2 కిలోమీటర్ల వరకూ కారుతో ఆమె స్కూటీని వెంబడించిన ప్రబుద్ధుడి తీరుతో డిసిల్వకు చిర్రెత్తుకొచ్చింది. 

మహాబలేశ్వర్ సిగ్నల్ దగ్గర స్కూటీని పక్కన ఆపి ఎందుకు ఇలా చేస్తున్నారని ఆమె ప్రశ్నించింది. కారు నుంచి కోపంగా దిగిన ఆ వృద్ధుడు డిసిల్వ టీ-షర్ట్ పట్టుకుని పైకి లేపి ముఖంపై దాడి చేశాడు. పది సెకన్ల పాటు తనకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదని ఆమె చెప్పుకొచ్చింది. రోడ్డుపై వెళుతున్న వారు ఏం జరిగిందోనని గుమిగూడారు. అయితే జనాన్ని చూసిన సదరు వృద్ధుడు మెల్లిగా అక్కడ నుంచి జారుకోవాలని చూసి కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతనిని గమనించిన డిసిల్వ రక్తం కారుతుండగానే ఎలాగోలా కారు దగ్గరకు వెళ్లి కీస్ తీసేసుకుంది. ఆ కారు కీస్ను పోలీసులకు ఇచ్చింది. ఆ సమయంలో కారులో వృద్ధుడి భార్య కూడా ఉంది. ఈ ఘటనపై విచారించిన పోలీసులు నిందితుడిపై, నిందితుడి భార్యపై పలు కేసులు నమోదు చేశారు. 118 (1), 115 (2), 352, 119, 177, 184 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పుణెలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్యంత బాధాకరమైన విషయం అని, పుణెలో ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. Jerlyn D'Silva ఇన్స్టాగ్రాంలో కంటెంట్ క్రియేటర్ కూడా కావడం గమనార్హం.