
- పుణె పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఘటన
- నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్న 8 స్పెషల్ టీమ్స్
ముంబై:మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. పుణెలోని స్వర్గేట్ బస్ స్టేషన్‌లో ఆగి ఉన్న బస్సులోనే యువతి(26)పై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్ (36)గా గుర్తించిన పోలీసులు..అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సతారా జిల్లాలోని ఫల్తాన్ గ్రామానికి చెందిన యువతి ఓ ఆసుపత్రిలో కౌన్సెలర్‌గా పనిచేస్తున్నది.
మంగళవారం ఉదయం 5.45 నుంచి 6.30 గంటల మధ్య స్వర్గేట్ బస్టాండ్‌కు చేరుకున్నది. ఫల్తాన్‌కు వెళ్లే బస్సు కోసం ప్లాట్‌ఫామ్ వద్ద వెయిట్ చేస్తున్నది. దత్తాత్రేయ రాందాస్ అనే వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. ఫల్తాన్‌కు వెళ్లే బస్సు మరో ప్లాట్‌ఫామ్ పై ఆగిఉందని యువతికి చెప్పాడు. అది నిజమేనని నమ్మిన యువతి అతడి వెంట వెళ్లింది. ఎవరూలేని చోట చీకటి ప్రదేశంలో పార్క్ చేసిన బస్సు వద్దకు ఆమెను దత్తాత్రేయ తీసుకెళ్లాడు.
ప్రయాణికులు ఎవరూ లేరని ఆమె ప్రశ్నించగా బస్సు లోపల అందరూ పడుకున్నారని నమ్మబలికాడు. యువతి బస్సులోకి ప్రవేశించగానే లోపలి నుంచి డోర్ లాక్ చేసి..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె సహాయంతో స్వర్గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో వైద్య పరీక్షల కోసం బాధితురాలిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి..నిందితుడిని దత్తాత్రేయ రాందాస్ గా గుర్తించారు. శిక్రపూర్, శిరూర్ పోలీస్ స్టేషన్లలో అతడిపై ఇదివరకే దొంగతనం కేసులున్నాయని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు 8 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఉరితీయడం తప్ప వేరే శిక్ష ఉండదు
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ.. "స్వర్గేట్ బస్ స్టేషన్‌లో జరిగిన అత్యాచార ఘటన దురదృష్టకరం. సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. ఈ కేసులో నిందితులు చేసిన నేరం క్షమించరానిది. అతనిని ఉరితీయడం తప్ప వేరే శిక్ష ఉండదు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పుణె పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాను. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులకు అవసరమైన సూచనలు ఇచ్చారు" అని ట్వీట్ చేశారు.