పంజాబ్‌ రైతుకు కోపమొచ్చింది!

పంజాబ్ రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పంట రుణాలపై కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం అరకొర చర్యలు చేపట్టి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.4736 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినా అన్నదాతల్లో అసంతృప్తి తగ్గలేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.2వేలు ఇస్తున్నా రైతుల ఆగ్రహం చల్లారలేదు. వారం కింద వేల సంఖ్యలో రైతులు అమృత్​సర్ సమీపంలో రెండు రోజుల పాటు రైల్వే ట్రాక్ లపై జాగరణ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేశారు. పంట రుణాలను పాక్షికంగా కాకుండా పూర్తి స్థాయిలో మాఫీ చేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. అలాగే చెరకు పంట బకాయిలను 15 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలనేది మరో డిమాండ్. ఈ రెండు డిమాండ్ల ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రుణాలను వెంటనే చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తామంటూ బెదిరించడం, లోన్ ఇచ్చే టైంలో తీసుకున్న బ్లాంక్ చెక్ లను చూపించి కేసుల పేరుతో వేధించడం కూడా రైతుల ఆగ్రహానికి కారణాలయ్యాయి. ఈ బెదిరింపు, వేధింపు చర్యలకు తక్షణమే స్వస్తి పలకాలని వ్యవసాయదారులు కోరుతున్నారు. అధికారంలోకి రావడానికి ముందు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వేరు. పవర్ లోకి వచ్చిన తర్వాత చేపడుతున్న చర్యలు వేరు. దీంతో సర్కార్ తమను మోసగించిందన్న అభిప్రాయానికి రైతులు వచ్చారు. వ్యవసాయ రంగంలో ప్రతి రోజూ తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు రైతులు. వాటి పరిష్కారం కోసం చొరవ చూపకుం డా కొద్ది మొత్తంలో రుణ మాఫీల వంటి ఉపశమన చర్యలతో సర్కార్ కాలం వెళ్లబుచ్చుతోం దని మండిపడుతున్నారు. సాగురంగం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల రిష్కారానికి పాలకులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే తమ బతుకులు అప్పుల ఊబిలోనే తెల్లార్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చెరకు రైతులకు రూ. 122 కోట్ల బకాయిలు
పంజాబ్ లోని చెరకు రైతులకు వివిధ షుగర్ మిల్లులు, ఫ్యాక్టరీలు రూ. 122 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత వ్యవసాయ సీజన్ నుంచి ఈ అమౌంట్ పెండింగ్ లో ఉంది. బకాయిల మొత్తం రాకపోవడంతో చెరకు రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు తెచ్చి పంట సాగు చేస్తే తమకు న్యాయబద్దంగా రావాల్సిన బకాయిలు ఇప్పటివరకు రాలేదని వాపోతున్నారు. రైతులకు బకాయిలు చెల్లించాలని షుగర్ ఫ్యాక్టరీలపై సర్కార్ కూడా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు బకాయిలను చెల్లించకపోవటంతో రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. రోజువారీ ఖర్చులకు చేతిలో డబ్బు ఉండట్లేదు. తీసుకున్న లోన్లకు వడ్డీలు కూడా కట్టలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పై రైతులు మండిపడుతున్నారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని పంట రుణాలను కొందరికే అరకొరగా మాఫీ చేసిందంటున్నారు రైతులు.

రూ. రెండు లక్షల ఆదాయం దాటితే మాఫీకి అనర్హుడే
రెండు లక్షల వరకు ఆదాయం ఉన్న చిన్న, సన్నకారు రైతులను పంట రుణాల మాఫీ స్కీం పరిధిలోకి తీసుకువచ్చింది సర్కార్.ఆదాయం రెండు లక్షలకు మించి ఒక్క రూపాయి ఉన్నా మాఫీకి అనర్హుడిగా ప్రకటిం చింది ప్రభుత్వం. అమరీందర్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మెజారిటీ రైతులు క్రాప్ లోన్ స్కీం ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. పెద్ద రైతులను మినహాయిస్తే చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి దారుణంగా మారిం ది. బ్యాం కుల నుంచి తీసుకున్న లోన్లకు వడ్డీలు కూడా కట్టే పరిస్థితి లేకుండా పోయిందని తాజాగా నిర్వహించి న అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారా నికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. అంతేతప్ప ఎన్నికల ప్రయోజనాలు కోసం నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు పరిష్కారం కావంటున్నారు. పంజాబ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో పై చదువులు చదివినవాళ్లు చాలా తక్కువ మంది. రూరల్ ఏరియాల్లో 70 శాతం మంది కనీసం పదో తరగతి కూడా చదవలేదు. రైతు కూలీల కుటుం బాల్లో ఇది 90 శాతం వరకు ఉంది. సేద్యం మానేసి వేరే పని చేద్దామన్నా అందుకు తగ్గ చదువులు లేవు. దీంతో కష్టమో, నష్టమో నేలతల్లినే నమ్ము కుని బతుకుబండి లాగిస్తున్నారు రైతన్నలు.