పంజాబ్ మంత్రి సిద్దూకు షాకిచ్చారు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్. అతనికి కేటాయించిన శాఖల్లో ఒకదాన్ని కట్ చేశారు. కొంతకాలంగా అమరీందర్ సింగ్ , సిద్దూ మధ్య గ్యాప్ పెరిగింది. సీఎంతో సంబంధం లేకుండానే పనులు చేసుకుంటున్నారు సిద్దూ. నిన్న నిర్వహించిన కేబినెట్ భేటీకి కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో సిద్దూ శాఖను కట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం అమరీందర్ సింగ్.
సిద్ధూకు కేటాయించిన శాఖల్లో స్థానిక సంస్థల మంత్రిత్వ శాఖను తొలగించాలని గవర్నర్ విజయేంద్ర పాల్ సింగ్ కు అమరీందర్ సింగ్ సిఫారసు చేశారు. సిద్ధూకు కేటాయించిన మంత్రిత్వ శాఖల్లో స్థానిక సంస్థల శాఖ చాలా ముఖ్యమైనది. ఈ శాఖను ప్రస్తుతానికి తానే నిర్వహించాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఇక పై పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు, ప్రదర్శన శాలల శాఖలు మాత్రమే సిద్ధూ చూడనున్నారు.
సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దూ మధ్య మొదటి నుంచి అంతంత మాత్రంగానే సంబంధాలున్నాయి. సీఎంకు ఇబ్బంది కలిగించేలా చాలాసార్లు కామెంట్ చేశారు సిద్దూ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎన్నికల ఫలితాల తర్వాత స్పందించిన అమరీందర్ సింగ్.. సిద్దూ లాంటి నేతల వ్యాఖ్యల వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని కామెంట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే తన శాఖను కట్ చేస్తూ సీఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు సిద్ధూ. అమరీందర్ సింగ్ ను తానెప్పుడూ పెద్దన్నగానే చూశానని తెలిపారు. శాఖల మార్పుపై తనతో చర్చిస్తే బాగుండేదన్న సిద్దూ.. తనను ఒంటరి చేయడం బాగా లేదన్నారు.
గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ… వేదిక దగ్గర పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జీవెద్ బజ్వాను ఆలింగనం చేసుకున్నారు. సిద్ధూ చర్యపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. తన కేబినెట్ సభ్యుడైనా… పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా సిద్ధూ తీరును ఓపెన్ గానే తప్పుపట్టారు.