చన్నీ మేనల్లుడుపై పంజాబ్ సీఎం మాన్ తీవ్ర ఆరోపణలు

చన్నీ మేనల్లుడుపై పంజాబ్ సీఎం మాన్ తీవ్ర ఆరోపణలు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చన్నీ మేనల్లుడు రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేశాడని చెప్పారు. సంగ్రూర్‌లో తహసీల్ కాంప్లెక్స్‌ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మన్ ఈ ఆరోపణలు చేశారు. 

రూ.2 కోట్లు డిమాండ్ 

స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక క్రికెటర్ నుండి చన్నీ మేనల్లుడు రూ.2 కోట్లు లంచం డిమాండ్ చేశాడని సీఎం మాన్ ఆరోపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ధర్మశాలలో పంజాబ్ క్రికెటర్‌ని చన్నీ మేనల్లుడు కలిశాడని, ఆ సందర్భంలో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగానికి క్రికెటర్ దరఖాస్తు చేసుకున్నాడని, అప్పుడే రూ.2 కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపించారు. 

అప్పట్లో అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సదరు క్రికెటర్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చన్నీ పదవీ బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. అప్పుడే తన మేనల్లుడు.. క్రికెటర్ తో  భేటీ అయిన సందర్భంలో రూ.2 కోట్లు డిమాండ్ చేశాడని చెప్పాడు. ఆ సమయంలో బాధిత క్రికెటర్ రూ.2 లక్షలు చెల్లించాడని పేర్కొన్నారు.

ఖండించిన చన్నీ

ఈ ఆరోపణలను మాజీ సీఎం చన్నీ తీవ్రంగా ఖండించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ విమర్శించారు. తన మేనల్లుడు ద్వారా ఉద్యోగాలు లేదా బదిలీలు చేపట్టలేదని, అవినీతి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. 

కేంద్రంపైనా విమర్శలు

అంతేకాదు..గత ప్రభుత్వాలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని, దుర్వినియోగమైన ప్రతి పైసాను రికవరీ చేస్తామని సీఎం మాన్ స్పష్టం చేశారు. గోధుమ రైతులపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోందని సీఎం మన్ విమర్శించారు. ఇప్పటికీ రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్ (RDF) కింద పెండింగ్‌లో ఉన్న రూ.3 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌కు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయమైన వాటా వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. 

రాజకీయ దుమారం 

మరోవైపు.. చన్నీ మేనల్లుడుపై భగవంత్ మాన్ చేసిన ఆరోపణలు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.