- పంజాబ్ లో ఫ్రీ కరెంట్ ఇస్తున్నం.. ఆప్‌ను గెలిపిస్తే మీకూ ఇస్తం
అహ్మదాబాద్: పంజాబ్‌లో ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని గెలిపిస్తే గుజరాత్లో ఫ్రీ కరెంట్ ఇస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చారు. బుధవారం గుజరాత్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ కరెంట్‌కు సంబంధించిన 25 వేల జీరో కరెంట్ బిల్లులను తీసుకొచ్చానంటూ వాటిని చూపారు. ఆ బిల్లులపై పేర్లు, అడ్రస్ లతో సహా అన్ని వివరాలూ ఉన్నాయని, ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చన్నారు. పంజాబ్‌లో మొత్తం 75 లక్షల కుటుంబాలు ఉండగా, 61 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని వెల్లడించారు. గుజరాత్లో కూడా ఆప్‌ను గెలిపిస్తే ప్రతి నెలా 300 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు. పంజాబ్‌లో ఇప్పటికే 100 మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేశామని, వచ్చే జనవరి 26 నాటికి మరో 500 క్లినిక్‌లు ఓపెన్ చేస్తామన్నారు. తాము చెప్పింది చేస్తామని, చేసేదే చెప్తామన్నారు. గుజరాత్ మోడల్ అనేది వట్టిదేనని.. రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కాకుండా.. గుంతల్లో రోడ్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
పంజాబ్ లో రైతుల నిరసనలు
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బుధవారం గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లగా.. ఆయన సొంత రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉపాధి హామీ కనీస వేతనాన్ని రూ. 700కు పెంచాలని, పేదలకు ప్లాట్ల స్కీంను అమలు చేయాలని, విలేజ్ కోఆపరేటివ్ సొసైటీల్లో దళితులకు 33% ప్రాతినిధ్యం కల్పించాలని, లంపీ స్కిన్ డిసీజ్ తో పశువులు చనిపోయి, పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్లతో రైతులు, వ్యవసాయ కూలీలు, ట్రేడ్ యూనియన్ నాయకులు సంగ్రూర్‌లోని సీఎం మాన్ నివాసాన్ని ముట్టడించారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి వాళ్లను చెదరగొట్టారు. ఇవే డిమాండ్లపై రైతులు అక్టోబర్‌లో 19 రోజులు నిరసనలు తెలిపారు. వారి డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే, తాజా నిరసనల వెనుక బీజేపీ పాత్ర ఉందని ఆప్ విమర్శించింది.