పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. చండీగఢ్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం భగవంత్ మాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని భగవంత్ మాన్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 6% డియర్‌నెస్ అలవెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
పాత పెన్షన్ విధానంలో చేరేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తామని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా తెలిపారు. 2004లో నిలిపివేసిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని గతేడాది ఆగస్టులో ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది.