పంట వ్యర్థాల కాల్చివేతపై పంజాబ్ సర్కారు సీరియస్

పంట వ్యర్థాల కాల్చివేతపై పంజాబ్ సర్కారు సీరియస్

చండీగఢ్: నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలి కాలుష్యానికి కారణమవుతున్న గడ్డి కాల్చివేతల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. పొలాల్లో గడ్డి కాలబెడుతున్న రైతులపై కేసులు పెడుతున్నాయి. నెల రోజుల్లో 870 కేసులు నమోదు చేశామని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. 

రూల్స్ ఉల్లంఘించిన రైతులకు రూ.10.55 లక్షల జరిమానాలు విధించామని చెప్పింది. లా అండ్​ఆర్డర్ స్పెషల్ డీజీపీ అర్పిత్ శుక్లా మంగళవారం మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులతో జాయింట్ టీమ్స్ ఏర్పాటు చేశామని.. గడ్డి కాల్చొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,393 ఫామ్ ఫైర్స్ జరిగినట్టు శాటిలైట్ డేటా ద్వారా తెలిసింది. సెప్టెంబర్ 15 నుంచి ఇప్పటి వరకు 874 కేసులు పెట్టాం. మరో 397 కేసుల్లో రైతులకు రూ.10.55 లక్షల ఫైన్ విధించాం. 394 మంది రైతుల రెవెన్యూ రికార్డుల్లో రెడ్ ఎంట్రీస్ నమోదు చేశాం” అని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో రెడ్ ఎంట్రీ చేస్తే..  రైతు ఆ భూమిని అమ్మేందుకు, లోన్ తీసుకునేందుకు వీలుండదు.

హర్యానాలో 24 మంది అధికారులపై వేటు.. 

గడ్డి కాల్చివేతలను నియంత్రించడంలో విఫలమైన అధికారులపై హర్యానా సర్కార్ కొరడా ఝుళిపించింది. వ్యవసాయ శాఖకు చెందిన 24 మంది ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. వీరిలో 9 జిల్లాలకు చెందిన అగ్రికల్చర్ ఇన్ స్పెక్టర్లు, సూపర్ వైజర్లు, అగ్రికల్చర్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు ఉన్నారు. మరోవైపు, రాష్ట్రంలో గడ్డి కాల్చివేతలకు సంబంధించి 3 వేల కేసులు నమోదు చేశామని వ్యవసాయ మంత్రి శ్యామ్ సింగ్ రానా మంగళవారం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గడ్డి కాల్చివేతలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.