KKR vs PBKS: విజృంభించిన కోల్‌కతా బౌలర్లు.. 111 పరుగులకే కుప్పకూలిన పంజాబ్

KKR vs PBKS: విజృంభించిన కోల్‌కతా బౌలర్లు.. 111 పరుగులకే కుప్పకూలిన పంజాబ్

కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో ఘోరంగా ఆడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ఆ జట్టు సొంతగడ్డపై చెత్త బ్యాటింగ్ తో పరువు పోగొట్టుకుంది. మంగళవారం (ఏప్రిల్ 15) ముల్లన్పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బాధ్యత లేని ఆట తీరుతో స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లు విజృంభించడంతో 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. 30 పరుగులు చేసిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

టాస్ గెలిచి శ్రేయాస్ అయ్యర్ ఆశ్చర్యకరంగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అందుకు తగ్గట్టే పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్,ప్రియాంష్ ఆర్య ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించారు. తొలి వికెట్ కు 20 బంతుల్లోనే 39 పరుగులు జోడించారు. ఈ జోడీని హర్షిత్ రాణా విడదీశాడు. నాలుగో ఓవర్ రెండో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి ప్రియాంష్ ఆర్య(22) ఔటయ్యాడు. ఇదే ఓవర్ లో శ్రేయాస్ అయ్యర్ డకౌటయ్యాడు. ఎదుర్కొన్న రెండో బంతికే థర్డ్ మ్యాన్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

Also Read :- ఇంకా ఎన్ని రోజులు అదే ఆట.. కోహ్లీని చూసి నేర్చుకో

ఇక్కడ నుంచి పంజాబ్ కోలుకోలేకపోయింది. జోష్ ఇంగ్లిష్ (2), సిమ్రాన్ సింగ్ (30) పవర్ ప్లే లోపే ఔటయ్యారు. ఆ తర్వాత ఏ ఒక్కరూ బాధ్యతగా ఆడకుండా నిర్లక్ష్యపు షాట్ సెలక్షన్ తో పెవిలియన్ కు క్యూ కట్టారు. దీనికి తోడు కేకేఆర్ స్పిన్నర్లు రెచ్చిపోవడంతో నేహాల్ వధేరా (10), సూర్యాంష్ షెడ్జ్ (4), గ్లెన్ మ్యాక్స్ వెల్ (7), మార్కో జాన్సెన్ (1) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. శశాంక్ సింగ్ 18 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 100 పరుగులు దాటించాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అన్రిచ్ నోర్ట్జే, వైభవ్ అరోరా తలో వికెట్ పడగొట్టారు.