
- సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
అహ్మదాబాద్: గత సీజన్‌లో కోల్‌కతాను విజేతగా నిలిపి ఈ సారి పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ అందుకున్న శ్రేయస్ అయ్యర్ (42 బాల్స్‌లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 నాటౌట్) తొలి మ్యాచ్‌లోనే హిట్టయ్యాడు. శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటడంతో మెగా లీగ్‌ను పంజాబ్ కింగ్స్ అదిరిపోయే విజయంతో ఆరంభించింది. మంగళవారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో 11 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. తొలుత శ్రేయస్ మెరుపులతో పంజాబ్ 20 ఓవర్లలో 243/5 స్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), చివర్లో శశాంక్ సింగ్ (16 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 నాటౌట్) దంచికొట్టారు.
టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌లో సాయి సుదర్శన్ (41 బాల్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74), జోస్ బట్లర్ (33 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) ఫిఫ్టీలతో రాణించినా జీటీ 20 ఓవర్లలో 232/5 స్కోరు చేసి పోరాడి ఓడింది. అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్లాగ్ ఓవర్లలో విజయ్ కుమార్ వైశాక్ (0/28) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య మెరుపు ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ (5) ఫెయిలైనా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ తొలి బాల్ నుంచే హిట్టింగ్ మొదలెట్టాడు. ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌కే ఫోర్ కొట్టిన అతను.. వెంటనే డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్‌తో అలరించాడు. అర్షద్ వేసిన ఐదో ఓవర్లో ఆర్య మూడు ఫోర్లు, సిక్స్‌తో 21 రన్స్ పిండుకోగా.. పవర్‌ప్లేను పంజాబ్ 73/1తో ముగించింది. స్పిన్నర్ రషీద్ టర్నింగ్ బాల్‌కు ఆర్య ఔటవడంతో రెండో వికెట్‌కు 51 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. స్కోరు వంద దాటిన తర్వాత అజ్మతుల్లా (16), మ్యాక్స్‌వెల్ (0)ను వరుస బాల్స్‌లో ఔట్ చేసిన సాయి కిషోర్ పంజాబ్‌కు డబుల్ షాకిచ్చాడు. కానీ, కిశోర్ తర్వాతి ఓవర్లోనే రెండు సిక్సర్లు కొట్టిన శ్రేయస్ ఇన్నింగ్స్‌లో మళ్లీ జోష్ పెంచాడు.
ఈక్రమంలో 27 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను క్లాసిక్ షాట్లతో అలరించాడు. స్టోయినిస్ (20)ను కూడా కిశోర్ వెనక్కుపంపినా.. శ్రేయస్ తగ్గలేదు. ప్రసిధ్ వేసిన 17వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. చివర్లో అతనికి తోడైన శశాంక్ సింగ్ .. రషీద్ బౌలింగ్‌లో 6, 4, 6 కొట్టి స్కోరు 200 దాటించాడు. తన సెంచరీ కోసం ఆలోచించకుండా హిట్టింగ్ చేయాలని కెప్టెన్ శ్రేయస్ చెప్పడంతో సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్లో శశాంక్ వరుసగా 4, 2, 4, 4,4, 4 కొట్టి ఇన్నింగ్స్‌కు అద్భుతమైన ముగింపు ఇచ్చాడు.
సుదర్శన్, బట్లర్ పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌ను గుజరాత్ అద్భుతంగా ఆరంభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (14 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33), సాయి సుదర్శన్ స్టార్టింగ్ నుంచే ధనాధన్ షాట్లతో తొలి వికెట్‌కు 61 రన్స్ జోడించారు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఆర్యకు క్యాచ్ ఇచ్చి గిల్ ఔటైనా.. బట్లర్ తోడుగా సుదర్శన్ తన ధాటిని కొనసాగించాడు. ఈ ఇద్దరూ క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. పంజాబ్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా వీళ్లకు కలిసొచ్చాయి. 30 రన్స్ వద్ద సుదర్శన్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ రోప్ వద్ద అజ్మతుల్లా డ్రాప్ చేశాడు.
మ్యాక్స్‌వెల్ వేసిన 11వ ఓవర్లో చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ శ్రేయస్ డ్రాప్ చేయడంతో సుదర్శన్‌కు మరో లైఫ్ లభించింది. చహల్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, భారీ సిక్స్ బాదిన సుదర్శన్ సెంచరీ చేసేలా కనిపించాడు. చివరకు అర్ష్‌దీప్ వేసిన 13వ ఓవర్లో అతను శశాంక్‌కు క్యాచ్ ఇవ్వడంతో రెండో వికెట్‌కు 84 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అదే ఓవర్లో ఫోర్‌తో స్కోరు 150 దాటించిన బట్లర్‌కు రూథర్‌ఫొర్డ్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) తోడయ్యాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో అతను 6, 4, 6 బాదడంతో జీటీ 169/2తో రేసులోనే నిలిచింది. ఈ దశలో పంజాబ్ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. వైశాక్ రెండు ఓవర్లు, యాన్సెన్ ఒక ఓవర్లో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వకపోవడంతో జీటీ విజయ సమీకరణం18 బాల్స్‌లో 57 రన్స్‌గా మారింది.18వ ఓవర్లో బట్లర్‌ను యాన్సెన్ ఔట్ చేయడంతో పంజాబ్ విజయం ఖాయమైంది.
IPL లో నేడు
రాజస్తాన్ కోల్ కతా
గువాహతి 7.30PM
స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో..
మ్యాక్సీమమ్ డకౌట్లు
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బాల్‌కే ఔటైన మ్యాక్సీ లీగ్‌లో అత్యధికంగా 17 సార్లు డకౌటై రికార్డు సృష్టించాడు. 16 డకౌట్లతో దినేశ్ కార్తీక్, మన్‌దీప్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్ : 20 ఓవర్లలో 243/5 (శ్రేయస్ 97 *, ఆర్య 47, శశాంక్ 44*, సాయి కిశోర్ 3/30)
గుజరాత్ : 20 ఓవర్లలో 232/5 (సుదర్శన్ 74, బట్లర్ 54, అర్ష్‌దీప్ 2/36)