PBKS vs CSK: సెంచరీతో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. చెన్నై ముందు భారీ టార్గెట్!

PBKS vs CSK: సెంచరీతో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. చెన్నై ముందు భారీ టార్గెట్!

చండీఘర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య(42 బంతుల్లో 103:7 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపడంతో పాటు శశాంక్ సింగ్(36 బంతుల్లో 52: 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య టాప్ స్కోరర్ గా నిలిచాడు.  చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీద్ అహ్మద్, రవి చంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ముకేశ్ చౌదరీ, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ చౌదరీ బౌలింగ్ లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ డకౌటయ్యాడు. ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ (9)ను ఖలీల్ అహ్మద్ బౌల్డ్ చేశాడు. అయితే ఒక ఎండ్ లో ప్రియాంష్ పరుగుల వరద పారిస్తున్నా.. మరో ఎండ్ లో పంజాబ్ టపటప వికెట్లను కోల్పోతూ వస్తుంది. మార్కస్ స్టోయినిస్(4), నేహాల్ వధేరా(9), గ్లెన్ మ్యాక్స్ వెల్ (1) సింగిల్ డిజిట్ కే పెవిలియన్ బాట పట్టారు. దీంతో పంజాబ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

Also Read:-లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. భారీ ఛేజింగ్‌లో పోరాడి ఓడిన కోల్‌కతా

ఒక ఎండ్ లో సహచరులు విఫలమవుతున్నా మరో ఎండ్ లో ఆర్య హిట్టింగ్ తో అలరించాడు. పవర్ ప్లే లోనే 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఆ తర్వాత శశాంక్ సింగ్ సహాయంతో మరింత చెలరేగాడు. పతిరానా బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లు.. ఫోర్ కొట్టి 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత ఔటైనా.. చివర్లో మార్కో జాన్సెన్ (34), శశాంక్ సింగ్ తో కలిసి మెరుపులు మెరిపించి జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించారు. వీరిద్దరూ ఏడో వికెట్ కు అజేయంగా 38 బంతుల్లోనే 65 పరుగులు నెలకొల్పడం విశేషం.