
ఐపీఎల్ ఆరంభంలో అదరగొట్టిన పంజాబ్.. లీగ్ మధ్యలో కాస్తా తడబడుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 245 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శలు గుప్పించారు. ఈ ఐపీఎల్ సీజన్లో కూడా పంజాబ్ కప్ గెలవలేదని.. ఇందుకు ప్రధాన కారణం ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. రికీ పాంటింగ్ విదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి ఫామ్‌లో ఉన్న భారత ఆటగాళ్లను పక్కకు పెట్టడం వల్లే పంజాబ్ ట్రోఫీ గెలవలేదని పేర్కొన్నారు.
ఐపీఎల్ 18లో భాగంగా శనివారం (ఏప్రిల్ 26) పంజాబ్, కేకేఆర్ తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 201/4 స్కోర్ చేసింది. ఓపెనర్స్ అదిరిపోయే శుభారంభం ఇవ్వడంతో అయ్యర్ సేన భారీ స్కోర్ చేసింది. ప్రభ్‌మన్ సింగ్ (49 బంతుల్లో 83), ప్రియాంష్ ఆర్య (35 బంతుల్లో 69) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో రాణించారు. వీరిద్దరూ అందించిన స్టార్ట్‌తో ఈ మ్యాచులో పంజాబ్ భారీ స్కోర్ చేసేలానే కనిపించింది. కానీ వీరిద్దరూ ఔట్ అయ్యాక పంజాబ్ స్కోర్ నెమ్మదించింది.
ఇందుకు కారణం పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ నిర్ణయమే. ప్రభ్‌మన్ సింగ్, ప్రియాంష్ ఔట్ అయ్యాక.. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న నేహల్ వధేరా, శశాంక్ సింగ్‌ను కాకుండా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతోన్న గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్‌లను బ్యాటింగ్‌కు పంపించాడు పాంటింగ్. కానీ కోచ్ పాటింగ్ వ్యూహం ఫలించలేదు. ఈ ముగ్గురు అంచనాల మేర రాణించలేకపోవడంతో భారీ స్కోర్ చేస్తోందనుకున్న పంజాబ్.. 201 పరుగుల దగ్గరే ఆగిపోయింది.
►ALSO READ | ఓటమితో ఆస్ట్రేలియా టూర్‌ను ఆరంభించిన భారత ఉమెన్స్ హాకీ టీమ్
ఈ సీజన్‌లో శశాంక్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 52.66 సగటుతో 158 పరుగులు చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన నెహాల్ వధేరా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 189 పరుగులు చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వీరిని కేకేఆర్‌పై బ్యాటింగ్‌కు పంపకపోవడంతో పాంటింగ్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రికీ పాంటింగ్‌పై మనోజ్ తివారీ విమర్శలు గుప్పించాడు.
‘‘ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరని నా హృదయం చెబుతోంది. ఎందుకంటే.. ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్‌కు భారత ఆటగాళ్లపై నమ్మకం లేదు. కేకేఆర్ మ్యాచులో నేహల్ వధేరా, శశాంక్ సింగ్‌లను బ్యాటింగ్‌కు పంపకుండా అతను తన విదేశీ ఆటగాళ్లను నమ్మాడు. కానీ వారు విఫలమయ్యారు. పాంటింగ్ ఇదే విధంగా కొనసాగితే పంజాబ్ ఈ సీజన్లో కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు’’ అని పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. సెకండ్ ఇన్నింగ్స్‌కు భారీ వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ నెగ్గిన పంజాబ్ 20 ఓవర్లలో 201/4 స్కోరు చేసింది. ప్రభుసిమ్రన్ సింగ్ (49 బాల్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83), ప్రియాన్షు ఆర్య (35 బాల్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69) దంచికొట్టారు.
తర్వాత కోల్‌కతా ఒక ఓవర్‌లో 7/0 స్కోరు చేసింది. రెహమానుల్లా గుర్బాజ్ (1 నాటౌట్), సునీల్ నరైన్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ దశలో మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. చివరకు కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు ఆట సాధ్యం కాదని తేలడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.