GT vs PBKS: పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్

GT vs PBKS: పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ లోనే విక్టరీ అందుకుంది. మంగళవారం (మార్చి 25) ఆతిధ్య గుజరాత్ టైటాన్స్ పై 11 పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. పంజాబ్ విజయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (42 బంతుల్లో 97: 5 ఫోర్లు, 9 సిక్సర్లు)   కీలక పాత్ర పోషించగా.. బౌలర్లు  ఒత్తిడిలో అద్భుతంగా రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసి పోరాడి ఓడింది. బట్లర్ (54), సాయి సుదర్శన్ (74) హాఫ్ సెంచరీలు చేసినా ఫలితం లేకుండా పోయింది.            

244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమాన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 35 బంతుల్లో 65 పరుగులు జోడించిన తర్వాత 14 బంతుల్లోనే 33 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. ఈ దశలో జోస్ బట్లర్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ప్రారంభంలో నిదానంగా ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత బ్యాట్ ఝులిపించారు. రెండో వికెట్ కు 96 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వేగంగా ఆడే క్రమంలో సాయి సుదర్శన్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు. 

బట్లర్ కు జత కలిసిన రూథర్ ఫోర్డ్ ఆరంభంలో బౌండరీలతో హోరెతించాడు. గుజరాత్ విజయం ఖాయమన్న దశలో పంజాబ్ బౌలర్లు పుంజుకున్నారు. వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా విజయ్ కుమార్ వైశాక్ తన స్పెల్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతను వేసిన తొలి రెండు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. బట్లర్ (54) యాంకర్ ఇన్నింగ్స్ ఆడినా రూథర్ ఫోర్డ్(50) చివరి వరకూ పోరాడినా చివరివరకు పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ రెండు వికెట్లు తీసుకోగా.. మ్యాక్స్ వెల్, మార్కో జాన్సెన్ తలో వికెట్ పడగొట్టారు.      

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97) వీరోచిత ఇన్సింగ్ ఆడగా.. చివర్లో శశాంక్ సింగ్ (44) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.  ప్రియాన్ష్ ఆర్య (47) పవర్ ప్లే లో అద్భుతంగా ఆడాడు. గుజరాత్ బౌలర్లో సాయి కిశోర్ 3 వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, రబాడ చెరో వికెట్ తీశారు.