
ఐపీఎల్ 2025లో తొలిసారి లో స్కోరింగ్ మ్యాచ్ అభిమానులని అలరించింది. మంగళవారం (ఏప్రిల్ 15) ముల్లన్పూర్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 111 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బౌలర్లు చూపించిన పోరాటం అద్భుతం. చాహల్ 4 వికెట్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగా చివర్లో అర్షదీప్ సింగ్, జాన్సెన్ వికెట్లు తీసి పంజాబ్ కు సంచలన విజయాన్ని అందించారు. ఛేజింగ్ లో రస్సెల్ బయపెట్టినా మార్కో జాన్సెన్ బౌల్డ్ చేసి పంజాబ్ జట్టులో విజయాన్ని నింపాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. 112 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా 95 పరుగులకే ఆలౌట్ అయింది.
112 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్ లోనే సునీల్ నరైన్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. జేవియర్ బార్ట్‌లెట్ వేసిన రెండో ఓవర్లో డికాక్ (2) భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఈ దశలో రఘువంశీ, కెప్టెన్ రహానే జట్టును ఆదుకున్నారు. రహానే చిన్నగా ఆడినా.. మరో ఎండ్ లో రఘువంశీ దూకుడుగా ఆడుతూ స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లే చివరి ఓవర్లో 19 పరుగులు రావడంతో మొదటి 6 ఓవర్లలో కేకేఆర్ 55 పరుగులు చేసింది.
ఈ దశలో ఒక్కసారిగా కోల్‌కతా తడబడింది. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. మొదట రహానే (17)ను చాహల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ చేయగా.. ఇదే ఊపులో రఘువంశీ (37)ని వెనక్కి పంపాడు. ఈ సమయంలో పంజాబ్ పట్టు బిగించింది. వెంట వెంటనే మరో 4 వికెట్లు తీసి కేకేఆర్ ను ఒత్తిడిలోకి నెట్టింది. వెంకటేష్ అయ్యర్ (7), రింకూ సింగ్ (2), రమణ్ దీప్ సింగ్ (0), హర్షిత్ రానా(3) వరుస పెట్టి పెవిలియన్ కు క్యూ కట్టారు. చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రస్సెల్ చాహల్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టి మ్యాచ్ ను కేకేఆర్ వైపు తిప్పాడు. అయితే చివర్లో అర్షదీప్ వైభవ్ అరోరాను.. రస్సెల్ (17) ను జాన్సెన్ ఔట్ చేయడంతో పంజాబ్ ఓడిపోయే మ్యాచ్ లో గెలిచింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో ఘోరంగా ఆడింది. బాధ్యత లేని ఆట తీరుతో స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లు విజృంభించడంతో 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. 30 పరుగులు చేసిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అన్రిచ్ నోర్ట్జే, వైభవ్ అరోరా తలో వికెట్ పడగొట్టారు.
What a turnaround for Yuzi Chahal, what a night for Shreyas Iyer after his second-ball duck 💫
— ESPNcricinfo (@ESPNcricinfo) April 15, 2025
Scorecard: https://t.co/DWUwQ0uR2y | #PBKSvKKR #IPL2025 pic.twitter.com/Fw9gT7zLG2