PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. చెన్నైకు వరుసగా నాలుగో ఓటమి!

PBKS vs CSK: పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. చెన్నైకు వరుసగా నాలుగో ఓటమి!

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతుంది. చండీఘర్ వేదికగా మంగళవారం (ఏప్రిల్ 8) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ ల్లో పంజాబ్ కు ఇది మూడో గెలుపు కాగా.. ఐదు మ్యాచ్ ల్లో చెన్నైకి ఇది నాలుగో ఓటమి. భారీ ఛేజింగ్ లో కాన్వే (49 బంతుల్లో 69: 6 ఫోర్లు, 2 సిక్సర్లు), దూబే (42) పోరాడినప్పటికీ.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.             

220 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ను ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు రచీన్ రవీంద్ర (36), డెవాన్ కాన్వే తొలి వికెట్ కు 39 బంతుల్లో 61 పరుగులు జోడించి శుభారంభం అందించారు. పవర్ ప్లే తర్వాత 36 పరుగులు చేసిన రచీన్ రవీంద్ర మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. ఈ టోర్నీలో పేలవ ఫామ్ లో ఉన్న గైక్వాడ్ ఒక పరుగే చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో చెన్నై స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. 

ఈ దశలో చెన్నై సూపర్ కింగ్స్ ను కాన్వే, శివమ్ దూబే ఆదుకున్నారు. మూడో వికెట్ కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో వేగంగా ఆడడంలో ఈ జోడీ విఫలమైంది. దీంతో దూబే భారీ షాట్ కు ప్రయత్నించి బౌల్డయ్యాడు. మరో ఎండ్ లో కాన్వే 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా వేగంగా ఆడలేకపోయాడు. దీంతో చెన్నై లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది. ఇక ఎప్పటిలాగే ధోనీ (12 బంతుల్లో 2 సిక్సర్లతో 27) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. యష్ ఠాకూర్, మ్యాక్స్ వెల్ కు తలో వికెట్ లభించింది. 

Also Read : పూరన్‌కు ఆరెంజ్ క్యాప్.. విండీస్ క్రికెటర్ మరో అరుదైన ఘనత!

అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య(42 బంతుల్లో 103:7 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపడంతో పాటు శశాంక్ సింగ్(36 బంతుల్లో 52: 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య టాప్ స్కోరర్ గా నిలిచాడు.  చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీద్ అహ్మద్, రవి చంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ముకేశ్ చౌదరీ, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.