కోల్‌‌కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్‌‌ కింగ్స్​ విక్టరీ

కోల్‌‌కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్‌‌ కింగ్స్​ విక్టరీ
  •     సెంచరీతో చెలరేగిన జానీ
  •     దంచికొట్టిన శశాంక్‌‌ సింగ్​, ప్రభుసిమ్రన్‌‌ సింగ్​
  •     సాల్ట్‌‌, నరైన్‌‌ శ్రమ వృథా

కోల్‌‌కతా: ఐపీఎల్‌‌లో పంజాబ్‌‌ కింగ్స్‌‌ జూలు విదిల్చింది. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో జానీ బెయిర్‌‌స్టో (48 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 9 సిక్స్‌‌లతో 108 నాటౌట్‌‌), శశాంక్‌‌ సింగ్‌‌ (28 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 8 సిక్స్‌‌లతో 68 నాటౌట్‌‌), ప్రభుసిమ్రన్‌‌ సింగ్‌‌ (20 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 54) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 8 వికెట్ల తేడాతో కోల్‌‌కతాపై గ్రాండ్‌‌ విక్టరీని అందుకుంది. దీంతో టీ20 హిస్టరీలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. టాస్‌‌ ఓడిన కోల్‌‌కతా 20 ఓవర్లలో 261/6 స్కోరు చేసింది. ఫిల్‌‌ సాల్ట్‌‌ (37 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 75), సునీల్‌‌ నరైన్‌‌ (32 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 71), వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (39) రాణించారు. తర్వాత పంజాబ్‌‌ 18.4 ఓవర్లలో 262/2 స్కోరు చేసి నెగ్గింది. బెయిర్‌‌స్టోకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

నరైన్‌‌, సాల్ట్‌‌ దంచిన్రు..

కోల్‌‌కతాకు నరైన్‌‌, సాల్ట్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. మూడుసార్లు క్యాచ్‌‌ ఔట్‌‌ నుంచి బయటపడ్డ నరైన్‌‌ ఫోర్‌‌తో ఖాతా తెరవగా, ఆ వెంటనే 6, 4తో జోరందుకున్నాడు. థర్డ్‌‌ ఓవర్‌‌లో సాల్ట్‌‌ 6, 4, 6తో టచ్‌‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్‌‌లో ఇద్దరు కలిసి మూడు ఫోర్లు, ఓ సిక్స్‌‌తో 21 రన్స్‌‌, తర్వాతి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు బాదడంతో పవర్‌‌ప్లేలో కేకేఆర్‌‌ 76/0 స్కోరు చేసింది. 8వ ఓవర్‌‌లో నరైన్‌‌ రెండు ఫోర్లు, సాల్ట్‌‌ 6, 4తో 22 రన్స్‌‌ దంచారు. ఈ క్రమంలో నరైన్‌‌ 23, సాల్ట్‌‌ 21 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీలు చేశారు. ఇక 9, 10వ ఓవర్లలో వీరిద్దరు మూడు సిక్స్‌‌లు, రెండు ఫోర్లు కొట్టడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో నైట్‌‌రైడర్స్‌‌ 137/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. 

అయితే 11వ ఓవర్‌‌లో రాహుల్‌‌ చహర్‌‌ (1/33).. నరైన్‌‌ను ఔట్‌‌ చేసి తొలి వికెట్‌‌కు 138 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. ఈ దశలో వచ్చిన వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ చివరి వరకు క్రీజులో నిలిచి పంజాబ్‌‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 13వ ఓవర్‌‌లో రెండు సిక్స్‌‌లు కొట్టి సాల్ట్‌‌ వెనుదిరిగినా తను మాత్రం రెండు ఫోర్లు, సిక్స్‌‌తో బ్యాట్‌‌ ఝుళిపించాడు. అవతలి వైపు రెండు సిక్స్‌‌లతో జోరుమీదున్న రసెల్‌‌ (24)ను 16వ ఓవర్‌‌లో అర్ష్‌‌దీప్‌‌ (2/45) బోల్తా కొట్టించడంతో థర్డ్‌‌ వికెట్‌‌కు 40 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ టైమ్‌‌లో కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (10 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్స్‌‌లతో 28) కూడా జోరు చూపెట్టాడు. 18వ ఓవర్‌‌లో 6, 4, 6, 6తో 24 రన్స్‌‌ దంచి ఔటయ్యాడు. నాలుగో వికెట్‌‌కు 43 రన్స్‌‌ జతయ్యాయి. చివర్లో రింకూ సింగ్‌‌ (5) ఫోర్‌‌ కొట్టి మరో షాట్‌‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. రమన్‌‌దీప్‌‌ (6 నాటౌట్‌‌) 6 కొట్టగా, లాస్ట్‌‌ బాల్‌‌కు వెంకటేశ్‌‌ రనౌటైనా నైట్‌‌రైడర్స్‌‌ భారీ టార్గెట్‌‌ నిర్దేశించింది. 

శశాంక్‌‌ సూపర్‌‌ ఫినిషింగ్​..

భారీ లక్ష్య ఛేదనలో ప్రభుసిమ్రన్‌‌, బెయిర్‌‌స్టో కోల్‌‌కతా బౌలర్లను హడలెత్తించారు. రెండో ఓవర్‌‌లో 6, 6తో మొదలైన ప్రభు విధ్వంసం పవర్‌‌ప్లేతో ముగిసింది. థర్డ్‌‌ ఓవర్‌‌లో 6, 4, 6, 4 ఆ తర్వాత రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌ బాదాడు. ఈ క్రమంలో 18 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. 6వ ఓవర్‌‌లో బెయిర్‌‌స్టో 4, 6, 4, 4, 6తో 24 రన్స్‌‌ రాబట్టినా లాస్ట్‌‌ బాల్‌‌కు ప్రభు అనూహ్యంగా రనౌటయ్యాడు. దీంతో తొలి వికెట్‌‌కు 93 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 

రోసోవ్‌‌ (26) నెమ్మదించినా బెయిర్‌‌స్టో 6, 6, 4తో నాలుగు ఓవర్లలో 39 రన్స్‌‌ రావడంతో తొలి 10 ఓవర్లలో పంజాబ్‌‌ 132/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి బెయిర్‌‌స్టో దూకుడు మరో మెట్టు ఎక్కింది. 6, 4, 6, 6, 6, 6తో రెండు ఓవర్లలోనే 41 రన్స్‌‌ దంచాడు. 13వ ఓవర్‌‌లో రోసోవ్‌‌ను నరైన్‌‌ (1/24) ఔట్‌‌ చేయడంతో రెండో వికెట్‌‌కు 85 రన్స్‌‌ భాగస్వామ్యం బ్రేక్‌‌ అయ్యింది. ఈ దశలో వచ్చిన శశాంక్‌‌ సిక్సర్లతో సూపర్​ ఫినిషింగ్​ ఇచ్చాడు. బెయిర్‌‌స్టో 45 బాల్స్‌‌లో సెంచరీ పూర్తి చేశాడు. ముందు రెండు సిక్స్​లు కొట్టిన శశాంక్​17వ ఓవర్‌‌లో మరో మూడు సిక్స్‌‌‌‌‌లు దంచడంతో విజయసమీకరణం 18 బాల్స్‌‌లో 34గా మారింది. 18వ ఓవర్‌‌లో శశాంక్‌‌ 6, 6, 4  బెయిర్‌‌స్టో 6తో 25 రన్స్‌‌ వచ్చాయి. గెలుపుకు 9 రన్స్‌‌ అవసరం కాగా శశాంక్‌‌ 6తో ఈజీగా విజయాన్ని అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు


కోల్‌‌కతా: 20 ఓవరల్లో 261/6 (సాల్ట్‌‌ 75, నరైన్‌‌ 71, అర్ష్‌‌దీప్‌‌ 2/45). 

పంజాబ్‌‌: 18.4 ఓవర్లలో 262/2 (బెయిర్‌‌స్టో 108*, శశాంక్‌‌ 68*, నరైన్‌‌ 1/24).