- ఢిల్లీపై పంజాబ్ విక్టరీ
మొహాలీ: సామ్ కరన్ (47 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 63) దంచికొట్టడంతో ఐపీఎల్17వ సీజన్‌ను పంజాబ్ కింగ్స్ విజయంతో ఆరంభించింది. కారు యాక్సిడెంట్ నుంచి కోలుకొని కెప్టెన్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓడించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 174/9 స్కోరు చేసింది.
షై హోప్ (25 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), అభిషేక్ పోరెల్ (10 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్), డేవిడ్ వార్నర్ (21 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29) రాణించారు. పంత్ (18) ఆకట్టుకోలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో కరన్‌కు తోడు లివింగ్‌స్టోన్ (21 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 నాటౌట్) రాణించడంతో పంజాబ్ 19.2 ఓవర్లలో 177/6 స్కోరు చేసి గెలిచింది. ఖలీల్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. కరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
పోరెల్ ‘ఇంపాక్ట్’
టాస్ ఓడిన ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగగా తొలి వికెట్‌కు 39 రన్స్ జోడించి ఓపెనర్లు వార్నర్, మిచెల్ మార్ష్ (20) మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి ఓవర్లోనే మార్ష్ వరుసగా రెండు ఫోర్లతో టచ్‌లోకి రాగా.. రెండో ఓవర్లో వార్నర్ 6,4 దంచాడు. రబాడ, అర్ష్‌దీప్ ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టిన మార్ష్ మరో షాట్‌కు ట్రై చేసి రాహుల్ చహర్‌కు క్యాచ్ ఇచ్చాడు. రబాడ బౌలింగ్‌లో వార్నర్ వరుసగా 4,6 కొట్టి 5 ఓవర్లకే స్కోరు 50 దాటించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన హోప్ పవర్‌ప్లే తర్వాత స్పిన్నర్ రాహుల్ చహర్‌కు 6,4తో వెల్‌కం చెప్పాడు.
కానీ, క్రీజులో కుదురుకున్న వార్నర్‌ను హర్షల్ స్లో బౌన్సర్‌తో ఔట్ చేశాడు. ఇక్కడి నుంచి పంజాబ్ బౌలర్లు పుంజుకోగా.. ఢిల్లీ ఇన్నింగ్స్ డీలా పడింది. రబాడ వేసిన 11వ ఓవర్లో హోప్ ఔటయ్యాడు. స్టాండింగ్ ఒవేషన్ మధ్య క్రీజులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఫోర్లు కొట్టిన తర్వాత హర్షల్ వేసిన స్లో షార్ట్ బాల్‌కు బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు.
ఆంధ్ర ప్లేయర్ రిక్కీ భుయ్ (3), ట్రిస్టాన్ స్టబ్స్ (5) సైతం ఫెయిలవగా, రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో అలరించిన అక్షర్ (21)ను 18వ ఓవర్ ఫస్ట్ బాల్‌కు రనౌటయ్యాడు. తర్వాతి ఓవరో మూడే రన్స్ ఇచ్చిన అర్ష్‌దీప్ .. సుమీత్ (2)ను పెవిలియన్ చేర్చాడు. కానీ, ఆఖరి ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పోరెల్ అదరగొట్టాడు. హర్షల్ వేసిన ఆ ఓవర్లో ఖతర్నాక్ బ్యాటింగ్‌తో వరుసగా 4,6, 4, 4, 6 కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆ ఓవర్లో ఏకంగా 25 రన్స్ రావడంతో ఢిల్లీ మంచి స్కోరు చేసింది.
కరన్ ధనాధన్
ఛేజింగ్‌లో పంజాబ్‌కు మెరుపు ఆరంభమే దక్కినా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కాస్త డీలా పడింది. కెప్టెన్ ధవన్ (22) ఉన్నంతసేపు నాలుగు ఫోర్లతో అలరించాడు. నాలుగో ఓవర్లో ఇషాంత్ శర్మ అతడిని బౌల్డ్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. అదే ఓవర్లో జానీ బెయిర్‌స్టో (9) రనౌటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (26) తోడుగా కరన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఐదు ఫోర్లతో అలరించిన ప్రభ్‌సిమ్రన్ మూడో వికెట్‌కు 42 రన్స్ జోడించిన తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ వెంటనే కుల్దీప్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ (9)ను పంత్ స్టంపౌట్ చేయడంతో పంజాబ్ 100/4తో నిలిచింది. ఢిల్లీ రేసులోకి వచ్చేలా కనిపించింది. కానీ, లివింగ్‌స్టోన్ తోడుగా వరుస బౌండ్రీలతో హోరెత్తించిన కరన్ ఢిల్లీ ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. అటువైపు లివింగ్‌స్టోన్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీ ఫీల్డింగ్ తప్పిదాలు కూడా పంజాబ్‌కు కలిసొచ్చాయి. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఇషాంత్ దూరం అవ్వడం ఢిల్లీని దెబ్బతీసింది. జోరు కొనసాగించిన కరన్ 39 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని మ్యాచ్‌ను వన్‌సైడ్ చేశాడు. 19వ ఓవర్లో వరుస బాల్స్‌లో కరన్, శశాంక్ సింగ్ (0)ను ఔట్ చేసి ఢిల్లీ క్యాంప్‌లో ఆశలు రేపాడు. అయితే, లాస్ట్ ఓవర్ రెండో బాల్‌కు సిక్స్ కొట్టిన లివింగ్‌స్టోన్ మ్యాచ్‌ను ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 174/9 (అభిషేక్ పోరెల్ 32*, షై హోప్ 33, అర్ష్‌దీప్ 2/28).
పంజాబ్: 19.2 ఓవర్లలో 177/6 (కరన్ 63, లివింగ్‌స్టోన్ 38*, కుల్దీప్ 2/20)